కార్తీక పౌర్ణమికి అరుణాచలేశ్వరుడి దర్శనానికి టీజీఎస్ఆర్టీసీ ప్యాకేజీలు
కార్తీక పౌర్ణమి సందర్భంగా అరుణాచలేశ్వరుడిని దర్శించుకోవాలనుకునే భక్తులకు తెలంగాణ ఆర్టీసీ (TGSRTC) సువార్త చెప్పింది. శివ భక్తుల కోసం అరుణాచలం గిరి ప్రదక్షిణ టూర్ ప్యాకేజీని ఆర్టీసీ అధికారులు ప్రకటించారు.
ఈ ప్యాకేజీలో, కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకునే అవకాశం కూడా ఉంది. అంతేకాదు, వెల్లూరులోని గోల్డెన్ టెంపుల్‌ను కూడా సందర్శించే అవకాశాన్ని ఆర్టీసీ కల్పిస్తోంది. తెలంగాణలోని హైదరాబాద్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, నల్గొండ, వరంగల్, కరీంనగర్, మహబూబ్‌నగర్ నుంచి అరుణాచలేశ్వరుడి ఆలయానికి ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. ఈ నెల 15న కార్తీక పౌర్ణమి కాగా, 13వ తేదీ నుంచి ఆయా ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు బయలుదేరుతాయి. కాణిపాకం, గోల్డెన్ టెంపుల్లను దర్శించుకున్న తర్వాత, కార్తీక పౌర్ణమి పర్వదినం రోజు అరుణాచలం చేరుకుంటాయి.
అరుణాచల గిరి ప్రదక్షిణ టూర్ ప్యాకేజీని http://tgsrtcbus.in వెబ్సైట్లో బుక్ చేసుకోవచ్చు. పూర్తి వివరాల కోసం టీజీఎస్ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040-23450033, 040-69440000 సంప్రదించవచ్చు. టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఈ విషయాన్ని ట్వీట్ చేశారు.
పవిత్ర కార్తీక మాసంలో, తెలంగాణలోని శైవ క్షేత్రాలకు భక్తులకు అనుకూలంగా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. శ్రీశైలం, వేములవాడ, ధర్మపురి, కీసరగుట్ట తదితర దేవాలయాలకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఆయన వెల్లడించారు. ఆది, సోమవారాలలో శైవ క్షేత్రాలకు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ రద్దీని దృష్టిలో ఉంచుకుని, ఆ రోజుల్లో అదనపు బస్సులను అందుబాటులో ఉంచుతున్నారు.
దసరా స్పెషల్ పేరుతో ఆర్టీసీ ఛార్జీలు పెంచినట్లు ప్రచారం జరుగుతోందని, అందులో వాస్తవం లేదని సజ్జనార్ స్పష్టం చేశారు. రెగ్యులర్ సర్వీస్‌లకు సాధారణ ఛార్జీలే అమల్లో ఉన్నాయని చెప్పారు. దీపావళి తిరుగు ప్రయాణ రద్దీ నేపథ్యంలో ఏర్పాటు చేసిన స్పెషల్ బస్సుల్లో మాత్రమే రాష్ట్ర ప్రభుత్వ జీవో ప్రకారం ఛార్జీలు సవరించారు.