“కలలు నిజం చేసుకోవడానికి ఆర్థిక సహాయం” – విద్యార్థులకు కేంద్రం అండ
ఉన్నత విద్య కోసం ఎదురు చూస్తున్న మధ్యతరగతి విద్యార్థులకు కేంద్రం ఒక శుభవార్తను ప్రకటించింది. చదువుకునేందుకు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రతిభావంతులైన విద్యార్థులకు సహాయం చేయడానికి, కేంద్ర క్యాబినెట్ “పీఎం విద్యాలక్ష్మి” పథకాన్ని బుధవారం ఆమోదించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
“ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఏ విద్యార్థి ఉన్నత విద్యకు దూరం కాకూడదని” ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని మంత్రి అశ్విన్ వైష్ణవ్ స్పష్టం చేశారు.
“పీఎం విద్యాలక్ష్మి” పథకం కింద, ఉన్నత విద్యాసంస్థల్లో ప్రవేశం పొందిన విద్యార్థులు “విద్యా లక్ష్మి” పథకం ద్వారా రుణాలను పొందవచ్చు. ఈ రుణాలకు ఏ విధమైన హామీ లేదా హామీదారు అవసరం లేదని కేంద్ర సమాచార శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ మీడియాతో తెలిపారు. దేశవ్యాప్తంగా 860 ఉన్నత విద్యాసంస్థల్లో ప్రవేశం పొందిన విద్యార్థులు ఈ పథకం ద్వారా రూ. 7.50 లక్షల వరకూ రుణాన్ని పొందవచ్చు. ఈ రుణాలకు బ్యాంకులకు కేంద్రం 75% వరకు హామీ ఇవ్వనుంది.
ఈ పథకం ద్వారా ఏటా గరిష్టంగా 22 లక్షల మంది విద్యార్థులు ప్రయోజనం పొందే అవకాశం ఉందని కేంద్ర మంత్రి తెలిపారు. వార్షిక కుటుంబ ఆదాయం రూ. 8 లక్షల వరకు ఉన్నవారికి ఈ పథకం వర్తింపజేస్తారు. రుణంపై రూ. 10 లక్షల వరకు 3 శాతం వడ్డీ రాయితీ కూడా లభిస్తుంది. విద్యార్థులు “పీఎం విద్యాలక్ష్మి” పోర్టల్ ద్వారా నేరుగా రుణాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.