అమెరికా ఉపాధ్యక్షుడి భార్య మన తెలుగు వారే
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ గెలుపు జెండా ఎగరవేయడంతో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఉష చిలుకూరి అమెరికా ఉపాధ్యక్షుడి భార్యగా గుర్తింపు పొందనున్నారు. 538 ఎలక్టోరల్ ఓట్లలో 270 పొందిన రిపబ్లికన్ పార్టీ డొనాల్డ్ ట్రంప్‌ను అధ్యక్షుడిగా నిలిపితే, జెడీ వాన్స్ ఉపాధ్యక్షుడిగా ఎన్నిక కానున్నారు. వాన్స్ భార్య ఉషా చిలుకూరి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారని తెలియడంతో ఆమె పేరు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో మార్మోగిపోతోంది.
ఉష చిలుకూరి విద్యావంతుల కుటుంబం నుంచి వచ్చి అమెరికాలో స్థిరపడిన వ్యక్తి. ఆమె పూర్వీకుల మూలాలు కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం సాయిపురం గ్రామంలో ఉన్నాయి. విశాఖపట్నంలోనూ ఆమెకు బంధువులున్నారు. వైజాగ్‌కు చెందిన ఫిజిక్స్ ప్రొఫెసర్ సి శాంతమ్మ (96)కు ఉష మనవరాలు అవుతారు. శాంతమ్మ ఆంధ్ర యూనివర్సిటీలో ఫిజిక్స్ ప్రొఫెసర్‌గా పనిచేశారు. 96 ఏళ్ల వయస్సులో కూడా ఆమె ఇప్పటికీ పిల్లలకు పాఠాలు చెబుతున్నారు.
“నా మనవరాలు ఉష చిలుకూరి. నా భర్త చిలుకూరి సుబ్రహ్మణ్యశాస్త్రి ద్వారా మాకు ఆమెతో కుటుంబ సంబంధం ఉంది,” అని శాంతమ్మ చెప్పారు. “నా మరిది, ఐఐటీ ప్రొఫెసర్ రామశాస్త్రి మనవరాలే ఉష” అని ఆమె వివరించారు. రామశాస్త్రి కుమారుడు రాధాకృష్ణ, లక్ష్మి దంపతులు 1970వ దశకంలో అమెరికాకు వలస వెళ్లారు. వారు శాన్ డియాగోలో ఇంజనీరింగ్, మాలిక్యులర్ బయాలజీ ప్రొఫెసర్లుగా పనిచేస్తున్నారు. వారి కుమార్తే ఉషా చిలుకూరి. ఆమె భర్త జెడీ వాన్స్ అమెరికా ఉపాధ్యక్షుడిగా ఎన్నిక కానున్నారు.