కలిసి రావడానికి కార్తీక మాసంలో చెయవలసిన కార్యాలు
ఏడాది పొడవునా ఎన్నో శుభ మాసాలు వస్తూ పోతాయి. కానీ, కార్తీక మాసం ఆధ్యాత్మికంగా ఎంతో ప్రత్యేకమైనది. శాస్త్ర పండితుల ప్రకారం, కార్తీక మాసం దైవభక్తులకు నిజమైన వరప్రసాదం. ఈ మాసంలో చల్లటి నీటిలో స్నానం చేయడం, దానం చేయడం, జపాలు చేయడం వంటివి మహాపుణ్యం.
కార్తీక మాసం శివకేశవులకు చాలా ప్రీతికరమైనది. ఈ మాసంలో కొన్ని నియమాలను పాటిస్తే, కొన్ని శ్లోకాలను పఠిస్తే భక్తులకు విశేష ఫలితాలు లభిస్తాయని శాస్త్ర పండితులు చెబుతున్నారు.
నదులు, సముద్రాల్లో స్నానాలు చేయడం, అవు నెయ్యితో దీపారాధన, పుణ్యక్షేత్రాలను దర్శించడం, ఆహార నియమాలను పాటించడం, దానాలు, దీపదానం, నిరంతరం దైవనామస్మరణ వంటివి కార్తీక మాసంలో అధిక ఫలితాలను ఇస్తాయి. శివకేశవులకు ప్రీతికరమైన మాసం కాబట్టి, సోమవారాలు శివారాధన, శనివారాలు విష్ణు ఆరాధన చేయడం శుభప్రదం.
కార్తీక మాసంలో నాగులు చవితి, నాగ పంచమి, కార్తీక పౌర్ణమి రోజుల పూజలకు విశేష ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా కార్తీక మాసంలోని ఆదివారాలు చాలా ప్రత్యేకమైనవి. ఈ రోజులు కులదేవతను పూజించడం, మాంసాహారం తినకుండా ఉండటం, సూర్య నమస్కారాలు చేయడం, ఆదిత్య హృదయం పారాయణ చేయడం, ఒంటిపూట భోజనం చేయడం వంటివి మంచి ఫలితాలను ఇస్తాయి.
కుటుంబంలో తరతరాలుగా వంశపారంపర్యంగా వచ్చే దోషాలను తొలగించడానికి, జాతకంలో ఉన్న దోషాల నుండి విముక్తి పొందడానికి కార్తీక మాసంలో సంబంధిత స్తోత్రాలను భక్తిశ్రద్ధలతో పఠించాలి.
త్వరగా వివాహం కావాలనుకునే వారు, కుజ దోష సమస్యలతో ఇబ్బందులు పడుతున్న వారు, వివాహం ఆలస్యం అవుతున్న వారు కార్తీక మాసం మొత్తం సుబ్రహ్మణ్య అష్టకం చదవాలి. నాటకరంగం వారు, వైద్య వృత్తిలోని వారు ప్రత్యంగిరి, నరసింహ స్తోత్రాలను పారాయణ చేయాలి. విద్యార్థులు విజయం సాధించాలంటే సరస్వతి, హాయగ్రీవ, వినాయక స్తోత్రాలు చదవాలి. విజయాలు సాధించడానికి, భయాందోళనల నుండి విముక్తి పొందడానికి హనుమాన్ చాలీసా పారాయణ చేయాలి. తీవ్ర అనారోగ్యంతో బాధపడే వారు వైద్యనాద్ స్తోత్రం, ఆదిత్య హృదయం పారాయణ చేయాలి. వ్యాపారంలో నష్టాలు, కుటుంబ కలహాలు, అప్పులు, కోర్టు కేసులు, అపనిందలు, రాహు గ్రహ దోషాలతో బాధపడే వారు మంగళ చండికా స్తోత్రం పఠించాలి. చర్మ వ్యాధులు, అధిక రక్తపోటు, షుగర్ వ్యాధితో బాధపడే వారు మానసా దేవి స్తోత్రం చదవాలి.
ఎంత కష్టపడినా జీవితంలో ఎదుగుదల లేని వారు, నేత్ర సంబంధిత వ్యాధులతో బాధపడే వారు గరుడ ప్రయోగ మంత్రం పఠించాలి. శత్రు బాధల నుండి విముక్తి పొందాలి, జీవితంలో విజయం సాధించాలి అనుకునే వారు దుర్గా స్తోత్రం పారాయణ చేయాలి. ఇంట్లో వివాహాది శుభకార్యాలు జరగాలని ఆశించే వారు లలితా సహస్రనామ స్తోత్రం నిత్యం పఠించాలి. నూతన గృహం కొనుగోలు చేయాలనుకునే వారు మణిద్వీప వర్ణన పారాయణ చేయాలి. భూమి విక్రయించాలనుకునే వారు గణేశ ప్రార్థన, భూమి కొనుగోలు చేయాలనుకునే వారు లక్ష్మీ వరాహ స్వామి వారి శ్లోకాలు క్రమం తప్పకుండా పఠించాలి. నిరుద్యోగులకు ఉద్యోగం రావాలి, ఉద్యోగంలో ప్రమోషన్ కావాలనుకునే వారు కనకధార స్తోత్రం పఠించాలి.
కార్తీక మాసంలో ఇంటి గుమ్మాల వద్ద, తులసి కోట ముందు అవు నెయ్యితో దీపాలు పెట్టడం చాలా ముఖ్యం. సూర్యోదయానికి ముందు పెట్టే దీపాలు విష్ణుమూర్తికి, సాయంత్రం సంధ్య సమయంలో పెట్టే దీపాలు పరమశివుడికి చెందుతాయి.