బెంగళూరులో హైడ్రా: చెరువుల పునరుద్ధరణపై అధ్యయనం
హైడ్రా కమిషనర్ రంగనాథ్ బెంగళూరు చేరుకున్నారు. హైడ్రా అధికారులు మంగళవారమే బెంగళూరుకు బయలుదేరగా, రంగనాథ్ బుధవారం అక్కడికి చేరుకున్నారు. వచ్చే రెండు రోజులు ఆ నగరంలో చెరువుల పునరుద్ధరణను అధ్యయనం చేయనున్నారు. చెరువుల పునరుద్ధరణతో పాటు విపత్తు నిర్వహణ గురించి కూడా వారు అధ్యయనం చేయనున్నారు.
హైడ్రా అధికారులు యలహంకలోని కర్ణాటక స్టేట్ నేచురల్ డిజాస్టర్ మానిటరింగ్ సెంటర్ను సందర్శించనున్నారు. అక్కడ ఉన్న సీనియర్ శాస్త్రవేత్తలతో విపత్తు నిర్వహణపై చర్చలు జరుపుతారు. ఆ తరువాత అక్కడ సెన్సార్స్ సహాయంతో పర్యవేక్షిస్తున్న మురుగునీటి వ్యవస్థను పరిశీలిస్తారు. బెంగళూరు నగరంలోని చెరువులను కూడా వారు సందర్శించనున్నారు.
రెండో రోజు పర్యటనలో లేక్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఆనంద్ మల్లిగవాడ్తో రంగనాథ్ చర్చలు జరుపుతారు. కర్ణాటక ట్యాంక్ కన్జర్వేషన్ డెవలప్మెంట్ అథారిటీ చట్టం 2014పై చర్చించనున్నారు. ఆ తరువాత ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని మార్గందోన్హల్లీ చెరువు, ఇన్ఫోసిస్ సంస్థ అభివృద్ధి చేసిన చెరువులను సందర్శించి అక్కడ అమలు చేసిన ఉత్తమ విధానాలు, సాంకేతికతను పరిశీలిస్తారు.
తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ నగరంలో ఐదు చెరువులను పునరుద్ధరించాలని ఇటీవల ఆదేశించిన నేపథ్యంలో, హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఈ దిశగా తీవ్రంగా కృషి చేస్తోంది.