తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు

తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు, సీఎం రేవంత్ రెడ్డి తన పుట్టినరోజును రేపు ఘనంగా జరుపుకోనున్నారు. యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయడంతో ఆరంభమయ్యే ఈ వేడుకలు, మూసీ నది పునరుజ్జీవనం కోసం నిర్వహించబడే పాదయాత్రతో ముగుస్తాయి.

రేపు ఉదయం 8 గంటలకు కుటుంబ సమేతంగా యాదాద్రికి వెళ్లనున్న రేవంత్ రెడ్డి, 8:45 గంటలకు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఉదయం 10 గంటలకు YTDA అధికారులతో ఆలయ అభివృద్ధిపై సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. అనంతరం, మూసీ నది పునరుజ్జీవన ప్రజా చైతన్య పాదయాత్రను ప్రారంభిస్తారు.

మధ్యాహ్నం 1 గంటకు వలిగొండ మండలం సంగెం నుండి ప్రారంభమయ్యే ఈ పాదయాత్ర మూసీ పరివాహక ప్రాంతంలో 6 కిలోమీటర్లు కొనసాగుతుంది. ఈ సందర్భంగా భీమలింగం, ధర్మారెడ్డి కాల్వలను సందర్శించనున్న రేవంత్ రెడ్డి, మూసీ పరివాహక ప్రాంత రైతులతో సమావేశం నిర్వహించి, వారి సమస్యలు, ఆకాంక్షలను తెలుసుకుంటారు. రైతులతో సమావేశం అనంతరం రేవంత్ రెడ్డి హైదరాబాద్ కు తిరిగి వెళ్లనున్నారు.

ఈ కార్యక్రమ ఏర్పాట్లను ఎంపీ చామల కిరణ్ కుమార్, ఎమ్మేల్యే కుంభం అనిల్ కుమార్ పర్యవేక్షిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *