వైట్ హౌస్‌లో మహిళా అధిపత్యం: ట్రంప్ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా సూసీ వైల్స్‌

అమెరికా అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ తన పాలనకు సిద్ధంగా ఉన్నారని గురువారం ప్రకటించారు. ఈ ప్రకటనతో అమెరికా రాజకీయ వర్గాల్లో ఒక కొత్త చర్చ మొదలైంది. ఎందుకంటే, ట్రంప్ తన చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా సూసీ వైల్స్‌ను ఎంపిక చేశారు. ఇది అమెరికా చరిత్రలో వైట్ హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ పదవిని ఒక మహిల చేపట్టడం ఇదే తొలిసారి.

67 ఏళ్ల సూసీ వైల్స్ ట్రంప్ ఎన్నికల ప్రచారంలో కీలక భూమిక పోషించారు. 2016, 2020 ప్రచారాలలో కూడా ఆమె ట్రంప్‌కు సన్నిహితంగా ఉండి సలహాలు ఇచ్చారు. “అమెరికన్ చరిత్రలో గొప్ప రాజకీయ విజయాలలో ఒకదానిని సాధించడంలో సూసీ వైల్స్ నాకు ఎంతగానో సాయపడ్డారు. ఆమె చాలా ధృడమైన, తెలివైన, వినూత్నమైన వ్యక్తి. అందరూ ప్రశంసించదగిన, గౌరవించదగిన మనిషి. అమెరికా చరిత్రలో మొట్టమొదటి మహిళా చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా సూసీ అర్హత కలిగిన వ్యక్తి” అని డొనాల్డ్ ట్రంప్ మెచ్చుకున్నారు.

ట్రంప్ చేసిన ఈ ప్రకటనపై అమెరికా ఉపాధ్యక్షుడిగా త్వరలోనే బాధ్యతలు స్వీకరించబోతున్న జేడీ వాన్స్ స్పందించారు. “గ్రేట్ న్యూస్” అని అభివర్ణించారు. ఎన్నికల ప్రచారంలో ట్రంప్‌కు సూసీ కీలకంగా వ్యవహరించారని గుర్తుచేశారు. “ఆమె వైట్ హౌస్‌లో కూడా ఒక పెద్ద అసెట్ అవుతారు. ఆమె నిజంగా చాలా మంచి వ్యక్తి” అని కొనియాడారు.

సూసీ వైల్స్ మే 14, 1957న జన్మించారు. సుదీర్ఘకాలంగా రాజకీయ వ్యూహకర్తగా ఉన్న ఆమె గతంలో రోనాల్డ్ రీగన్ ‘1980 అధ్యక్ష ఎన్నికల’ ప్రచారంలో పనిచేశారు. 2018లో జరిగిన ఎన్నికలలో ఫ్లోరిడా రిపబ్లికన్ గవర్నర్ రాన్ డిసాంటిస్ విజయం సాధించడంలో కూడా ఆమె కీలకంగా వ్యవహరించారు. తన కెరీర్ ప్రారంభంలో రిపబ్లికన్ యూఎస్ ప్రతినిధులు జాక్ కెంప్, టిల్లీ ఫౌలర్ల వద్ద కూడా ఆమె పనిచేశారు. ట్రంప్‌కు 2016, 2020 ఎన్నికల సమయంలో కూడా సీనియర్ సలహాదారుగా బాధ్యతలు నిర్వర్తించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *