“శ్యామ్ సింగరాయ్” షూటింగ్ సమయంలో సాయి పల్లవి కన్నీరు!
“నేచురల్ స్టార్” నాని, బాక్సాఫీస్ క్వీన్ సాయి పల్లవి జంటగా నటించిన “శ్యామ్ సింగరాయ్” చిత్రం 2021 డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. కోల్‌కతా బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ చిత్రం నాని, సాయి పల్లవి కెరీర్లో ప్రత్యేకంగా నిలిచింది. ఇద్దరి నటనకు ప్రేక్షకులు, విమర్శకులు ప్రశంసలు కురిపించారు. ఈ ఇంటెన్స్, పవర్ఫుల్ ప్రేమకథకు రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహించారు.
“శ్యామ్ సింగరాయ్” షూటింగ్ సమయంలో సాయి పల్లవి ఏడ్చారని తాజాగా “అమరన్” సక్సెస్ మీట్లో ఆమె తెలిపారు. “శ్యామ్ సింగరాయ్” షూటింగ్‌లోని కష్టాలను గుర్తుచేసుకుంటూ, “ప్రతిరోజూ షూటింగ్ ముగిసిన తర్వాత ఎంతో ఆనందంగా ఉండేది. నా సన్నివేశాలు చాలా వరకూ రాత్రి పూట చిత్రీకరించారు. రాత్రి షూటింగ్‌లు నాకు అలవాటు లేదు. పగలు నిద్రరాదు కాబట్టి రాత్రిళ్లు నా పరిస్థితి దారుణంగా ఉండేది. కొన్నిసార్లు తెల్లవారే వరకు మేల్కొని ఉండాల్సి వచ్చేది. దాదాపు 30 రోజులు ఇలానే గడిచాయి. బిజీ షెడ్యూల్స్ కారణంగా రాత్రి “శ్యామ్ సింగరాయ్” షూటింగ్ చేస్తూ ఉదయం మరో సినిమా సెట్‌కి వెళ్లేదాన్ని” అని సాయి పల్లవి చెప్పుకొచ్చారు.
“ఒకరోజు రాత్రి నన్ను చూడటానికి నా చెల్లి వచ్చింది. తనతో మాట్లాడుతూ ఒక్కసారిగా ఏడ్చేశాను. ఒప్పుకొన్న సినిమాలు చేయాలనుకుంటున్నాను కానీ, ఓ రోజు విశ్రాంతి దొరికితే బాగుండు అంటూ బాధపడ్డాను. నా చెల్లి నేరుగా నిర్మాత వెంకట్ బోయనపల్లి దగ్గరకు వెళ్లి, ‘మా అక్క ఏడుస్తోంది. ఒక రోజైనా సెలవు ఇవ్వండి’ అని అడిగింది. ఆయన వెంటనే నా వద్దకు వచ్చి, ‘ఒకటి కాదు పది రోజులు తీసుకో, అంతా బాగానే ఉందనుకున్నప్పుడు షూటింగ్‌కు రా’ అని అన్నారు. దాంతో నాకు విశ్రాంతి దొరికింది” అని సాయి పల్లవి వివరించారు.