సుధీర్ బాబు నటించిన ‘మా నాన్న సూపర్ హీరో’ జీ5లో!
నవ దళపతి సుధీర్ బాబు నటించిన ‘మా నాన్న సూపర్ హీరో’ సినిమా ఓటీటీలోకి అడుగుపెట్టనుంది. అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 2024 దసరా కానుకగా విడుదలై మంచి విజయం సాధించింది. సునీల్ బలుసు నిర్మించిన ఈ సినిమాలో ఆర్ణ కథానాయికగా నటించగా, సాయిచంద్, సాయాజీ షిండే, రాజు సుందరం, విష్ణు, శశాంక్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
తండ్రీ కొడుకుల మధ్య బంధాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించిన ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్ నవంబర్ 15న జీ5లో ప్రారంభం కానుంది. “సూపర్ హీరో తండ్రులందరూ.. కొడుకు అందమైన, భావోద్వేగ ప్రయాణాన్ని చూడండి. జీ5లో డిజిటల్ ప్రీమియర్‌ని మిస్ అవ్వకండి. మా నాన్న సూపర్ హీరో సినిమాను కుటుంబంతో కలిసి చూడండి” అని చిత్ర యూనిట్ ప్రకటించింది.
‘మా నాన్న సూపర్ హీరో’ చిత్రం థియేటర్లలో అందుకున్న విజయానికి హీరో సుధీర్ బాబు, దర్శకుడు అభిలాష్ రెడ్డి కంకర, నిర్మాత సునీల్ బలుసులు ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. “జానీ పాత్రతో ఎంతో భావోద్వేగానికి లోనయ్యాను. ప్రేమ, కర్తవ్యం, నిజాల మధ్య నలిగిపోయే పాత్ర అది. నాకు మద్దతు ఇచ్చిన అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతున్నా. నవంబర్ 15న జీ5లో సినిమా ప్రీమియర్ కానుంది. అక్కడ కూడా అదే ప్రేమ అందిస్తారని.. నా పాత్ర, సినిమాతో కనెక్ట్ అవుతారని ఆశిస్తున్నా” అని సుధీర్ బాబు అన్నారు.