పెద్దపల్లిలో రైలు ప్రమాదం: 11 బోగీలు పట్టాలపై బోల్తా!
పెద్దపల్లి జిల్లాలోని రాఘవపూర్ నుండి కన్నాల వెళ్ళే మార్గమధ్యలో బుధవారం ఉదయం ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో 11 బోగీలు పట్టాలపై బోల్తా పడిపోయాయి. స్థానికులు గుర్తించి రైల్వే అధికారులకు సమాచారం అందించారు. దీంతో అలర్ట్ అయిన అధికారులు వెంటనే రైలు రాకపోకలను నిలిపివేశారు.
పెద్దపల్లి జిల్లాలోని ఈ ప్రధాన రైలు మార్గం ద్వారానే ఢిల్లీ, చెన్నైలకు వెళ్ళే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైళ్లు, ఎక్స్ప్రెస్ రైళ్లు, ప్యాసింజర్ రైళ్లు, గూడ్స్ రైళ్లు ప్రయాణిస్తుంటాయి. ప్రమాదం తర్వాత అన్ని రైళ్లను ఆపివేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
ప్రమాదానికి గురైన గూడ్స్ రైలు గజియాబాద్ నుండి కాజీపేట వైపు ఐరన్ కాయల్స్ తీసుకు వెళుతున్నట్లు అధికారులు తెలిపారు. ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియరాలేదు. ప్రస్తుతం బోగీలను పట్టాల నుండి తొలగించేందుకు భారీ క్రేన్ లను ఉపయోగిస్తున్నారు. ఈ కార్యక్రమం పూర్తయ్యే వరకు రైళ్ల రాకపోకలు నిలిపివేయబడ్డాయి.
ఈ ప్రమాదంతో సుమారు 20 రైళ్లు రద్దు చేయబడ్డాయి. 18 రైళ్లను వేరే మార్గాలకు మళ్ళించబడ్డాయి. 4 రైళ్లు పాక్షికంగా రద్దు చేయబడ్డాయి. ప్రమాదానికి గల కారణాలను దర్యాప్తు చేస్తున్నారు.