సినీ నటి శ్రీరెడ్డిపై ఆంధ్రప్రదేశ్లో కేసు నమోదు
తూర్పు గోదావరి జిల్లాలో సినీ నటి శ్రీరెడ్డిపై కేసు నమోదు అయ్యింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, హోంమంత్రి వంగలపూడి అనితలపై అనుచిత వ్యాఖ్యలు చేశారని టీడీపీ ఏపీ మహిళా ప్రధాన కార్యదర్శి మజ్జి పద్మ ఫిర్యాదు చేయడంతో బొమ్మూరు పోలీసులు కేసు నమోదు చేశారు.
వైసీపీ పార్టీ హయాంలో సోషల్ మీడియాలో కూటమి నేతలపై శ్రీరెడ్డి తప్పుడు ప్రచారం చేశారని, వైసీపీ పార్టీకి, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి అనుకూలంగా టీడీపీ, జనసేన, బీజేపీ నేతలనే లక్ష్యంగా శ్రీరెడ్డి విషం చిమ్మారని మజ్జి పద్మ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు శ్రీరెడ్డిపై 196, 353(2), 79 BNS, 67 ITA-2000-2008 సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు.
అప్పుడు వైసీపీ ప్రభుత్వం ఉండడంతో ఎన్ని ఫిర్యాదులు చేసినా ఎవరూ పట్టించుకోలేదని మజ్జి పద్మ ఆరోపించారు. తక్షణమే శ్రీరెడ్డిని అరెస్టు చేయాలని టీడీపీ మహిళా నేత పద్మ డిమాండ్ చేశారు. ఈ ఏడాది జులై 20న కూడా సినీ నటి శ్రీరెడ్డిపై కర్నూలు త్రీటౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయ్యింది.
సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్, హోంమంత్రి అనితలపై ఆమె అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ టీడీపీ బీసీ సెల్ నాయకుడు నాగరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు, ఆ తర్వాతా సోషల్ మీడియాలో శ్రీరెడ్డి పలు సందర్భాల్లో వ్యక్తిగత దూషణలకు పాల్పడ్డారని నాగరాజు ఫిర్యాదులో పేర్కొన్నారు.
దీనికి సంబంధించిన అనేక వీడియోలు, క్లిప్పింగులతోపాటు పలు ఆధారాలను నాగరాజు పోలీసులకు సమర్పించారు. దీంతో శ్రీరెడ్డిపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
అయితే తాను చేసిన సోషల్ మీడియా పోస్టులపై శ్రీరెడ్డి ఇప్పటికే స్పందించారు. తాను తప్పు చేశానని క్షమించాలంటూ రెండు చేతులు జోడించి మరీ క్షమాపణలు చెప్పారు. ఇకపై అటువంటి చర్యలకు పాల్పడబోనని వెల్లడించారు.
కాగా, సోషల్ మీడియా వేదికగా కూటమి నేతలు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు చేస్తున్న వారిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయ్యింది. రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నవారిపై వ్యక్తిగత దూషణలతోపాటు వారి ఇళ్లల్లోని మహిళలపైనా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పోస్టులు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఇటీవల జరిగిన క్యాబినెట్ సమావేశంలో సోషల్ మీడియా వ్యవహారాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీసుకెళ్లారు. దీంతో అసభ్య పదజాలంతో దూషణలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఇప్పటికే పలువురు వైసీపీకి చెందిన సోషల్ మీడియా యాక్టివిస్టులను పోలీసులు అరెస్టు చేశారు.