చావు తర్వాత శరీరంలో ఏం జరుగుతుంది?
మనందరికీ చావు అంటే భయం. కానీ అమెరికాకు చెందిన ఒక నర్సు చెప్పిన మాటలు వినగానే ఆ భయం కొంత తగ్గుతుంది. ఆ నర్సు చెప్పేది ఏంటంటే.. ప్రాణం పోయిన తర్వాత కూడా శరీరం రెండు గంటల పాటు కొన్ని పనులు చేస్తుంది. ఎన్నో దశాబ్దాలుగా ఇంటెన్సివ్ కేర్ లో పనిచేసిన జూలీ మెక్ ఫేడెన్ వేల మంది మరణాలను తన కళ్ళారా చూశారు. మనిషి శరీరం నుండి ప్రాణం పోవడం, దాని తరువాత జరిగే మార్పులను జూలీ బాగా గమనించారు. తన అనుభవాన్ని ఆమె ఇటీవల యూట్యూబ్ లో పంచుకోవడంతో ఆ వీడియో వైరల్ గా మారింది.
చనిపోయిన వెంటనే శరీరం అంతులేని విశ్రాంతిని పొందుతుంది. అందుకే చాలా మంది మరణించిన వెంటనే మలమూత్ర విసర్జన చేయడం, ముక్కు లేదా చెవుల నుండి రక్తం కారడం వంటివి చూస్తుంటాం. శరీరంలోని కండరాలు అన్నీ విశ్రాంతి మోడ్ లోకి వెళ్లడంతో వాటిపై నియంత్రణ లేక ఇలా జరుగుతుందని ఆమె వివరించారు.
శరీరం చల్లబడటం మరో ముఖ్యమైన మార్పు. చనిపోయిన వెంటనే శరీర ఉష్ణోగ్రతలు గంటకు 1.5 డిగ్రీలు పడిపోతాయి. కొందరి శరీరాలు వేగంగా చల్లబడతాయి. కొందరిలో రెండు గంటలు పట్టవచ్చు.
శరీరం రంగు కూడా మారుతుంది. ప్రాణం శరీరం నుండి వేరుపడిన తర్వాత బాడీ ముదురు రంగులోకి మారుతుంది. దీనికి కారణం శరీరంలో ఉండిపోయిన రక్తం గురుత్వాకర్షణ శక్తికి లోనవ్వడమే. వ్యక్తిని పడుకోబెట్టినప్పుడు వారి కిందివైపు శరీరంలో రక్తం చేరుతుంది.
చివరగా, శరీరంలోని కండరాలు గట్టిపడటం కూడా జరుగుతుంది. జీవక్రియలు ఆగిపోవడం వల్ల కండరాలు గట్టిపడతాయి. పోస్ట్ మార్టం తర్వాత 2-4 గంటల్లోపు ఇది ప్రారంభమవుతుంది. 72 గంటల వరకు కొనసాగుతుంది. శరీరం మోయలేనంత బరువుగా అనిపిస్తుంది. ఆ తర్వాత శరీరం కుళ్లిపోవడం జరుగుతుంది.