తెలంగాణలో ప్రజా పాలన విజయోత్సవాలు ప్రారంభం!
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, డిసెంబర్ 7వ తేదీతో ఒక సంవత్సరం పూర్తి అవుతుంది. ఈ సందర్భంగా, నవంబర్ 14వ తేదీ నుండి డిసెంబర్ 9వ తేదీ వరకు ప్రభుత్వం “ప్రజా పాలన విజయోత్సవాలు” నిర్వహించనుంది. ఈరోజు సాయంత్రం 4 గంటలకు ఎల్బీ స్టేడియంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ వేడుకలను ప్రారంభించనున్నారు. 26 రోజుల పాటు నిర్వహించబడే ఈ వేడుకలు నెహ్రూ జయంతి రోజున ప్రారంభమై సోనియా గాంధీ పుట్టిన రోజున ముగుస్తాయి.
మొదటి రోజు “విద్యా విజయోత్సవాలు” బాలల దినోత్సవంతో ప్రారంభమవుతాయి. గురుకులాలు మరియు ప్రభుత్వ హాస్టల్ విద్యార్థులకు డైట్ కాస్మెటిక్ చార్జీలు పెంచడం, మౌలిక సదుపాయాలు కల్పించిన నేపథ్యంలో ఈ విద్యా విజయోత్సవాలు నిర్వహించబడుతున్నాయి. ఎల్బీ స్టేడియంలో 14,000 మంది విద్యార్థులతో ఈ వేడుకలు ప్రారంభమవుతాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేలా 26 రోజుల వేడుకలకు ప్రభుత్వం ప్రణాళిక చేసింది.
ప్రజా పాలన విజయోత్సవాల్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం కీలక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనుంది. డిసెంబర్ 9వ తేదీన తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ వేడుకలు ఘనంగా జరుగనున్నాయి. సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ మరియు బహిరంగ సభతో ఈ వేడుకలు ముగుస్తాయి. ముగింపు వేడుకలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ అగ్రనేతలైన సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను ఆహ్వానించనున్నారు.
కాగా, గాంధీ భవన్లో భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ జయంతి కార్యక్రమం జరుగుతుంది. ఉదయం 10.30 గంటలకు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు గాంధీ భవన్లో నెహ్రూ చిత్రపటానికి నివాళులు అర్పించనున్నారు. ఈ కార్యక్రమానికి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు మరియు సీనియర్ నాయకులు హాజరు కానున్నారు. అలాగే ఉదయం 10 గంటలకు అబిడ్స్లోని నెహ్రూ విగ్రహానికి కాంగ్రెస్ నేతలు మరియు మంత్రులు నివాళులర్పించనున్నారు.