గ్రేటర్ నోయిడాలో వైద్యుల తప్పిదం, కుటుంబం నిరసన!
గ్రేటర్ నోయిడాలోని ఆనంద్ స్పెక్ట్రమ్ ఆస్పత్రిలో జరిగిన ఘటన మొత్తం వైద్యరంగం తలదించుకునేలా చేసింది. 7 ఏళ్ల బాలుడికి ఎడమ కంటి చికిత్స కోసం తీసుకెళ్లిన తల్లిదండ్రులు, ఆస్పత్రిలో కుడి కంటికి ఆపరేషన్ చేయడం గమనించి తీవ్రంగా నిరసన తెలిపారు. ఆ బాలుడి కుటుంబం నుంచి ఆపరేషన్ కోసం రూ.45 వేలు వసూలు చేసిన వైద్యులు, తప్పు చేసినట్లు గుర్తించిన తర్వాత కూడా బాధ్యత వహించడానికి నిరాకరించారు.
ఈ ఘటనలో బాలుడి తల్లిదండ్రులు తమ కుమారుడికి ఎడమ కంటిలో సమస్య ఉన్నట్లు వైద్యులకు వివరించారు. వైద్యులు ఆపరేషన్‌కు సూచించగా, వారు రూ.45 వేలు డిపాజిట్ చేసి బాలుడిని ఆస్పత్రిలో చేర్పించారు. అనంతరం బాలుడికి కుడి కంటికి ఆపరేషన్ చేసి, డిశ్చార్జ్ చేశారు. ఇంటికి వెళ్లిన తర్వాత తల్లిదండ్రులు ఆపరేషన్ తప్పుగా జరిగిందని గుర్తించి, ఆస్పత్రిలో గొడవ చేశారు. చివరకు సీఎంఓ కార్యాలయానికి ఫిర్యాదు చేశారు.
ఈ విషయం బీటా 2 పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న సెక్టార్ గామా 1 లోని ఆస్పత్రికి సంబంధించింది. పోలీసులు కూడా సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.