కార్తీక పౌర్ణమికి టీజీఎస్ఆర్టీసీ షాక్!

కార్తీక పౌర్ణమి సందర్భంగా టీజీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతున్నా, అందులో అదనపు ఛార్జీలు వసూలు చేయబోతుందని ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వ జీవో ప్రకారం, 50 శాతం వరకు టికెట్ ధరలను పెంచుతూ టీజీఎస్ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది.

హైదరాబాద్ నగరం నుంచి, జిల్లా కేంద్రాల నుంచి నడిచే స్పెషల్ బస్సులకు మాత్రమే ఈ అదనపు ఛార్జీలు వర్తిస్తాయని టీజీఎస్ఆర్టీసీ ప్రకటించింది. మిగిలిన సాధారణ బస్సుల్లో ఛార్జీలు మాత్రం మాములుగానె కొనసాగుతాయి.

పవిత్ర కార్తీక మాసంలో, శైవ క్షేత్రాలకు భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఇది వరకే తెలిపారు. శ్రీశైలం, వేములవాడ, ధర్మపురి, కీసరగుట్ట, తదితర దేవాలయాలకు హైదరాబాద్ నగరం నుంచి స్పెషల్ బస్సులు నడుపుతున్నారు.

కార్తీక మాసం ఆర్టీసీకి ఎంతో కీలకమని, భక్తులకు అసౌకర్యం కలగకుండా తగు చర్యలు తీసుకుంటున్నట్లు సజ్జనార్ వెల్లడించారు. ఆదివారం, సోమవారం శైవక్షేత్రాలకు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని.. అందుకు అనుగుణంగా ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచామని తెలిపారు.

ఈ నెల 15న కార్తీక పౌర్ణమి నేపథ్యంలో తమిళనాడులోని అరుణాచలానికి ప్రత్యేక ప్యాకేజీని అందిస్తున్నారు. ఏపీలోని పంచారామాలకు ప్రతి సోమవారం ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు.

అరుణాచలం టూర్ ప్యాకేజీలో కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామితో పాటు వెల్లూరులోని గోల్డెన్ టెంపుల్‌ను సందర్శించే సౌకర్యాన్ని టీజీఎస్ఆర్టీసీ కల్పిస్తోంది. హైదరాబాద్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, నల్గొండ, వరంగల్, కరీంనగర్, మహబూబ్‌నగర్ నుంచి అరుణాచలానికి ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. కాణిపాకం, గోల్డెన్ టెంపుల్ దర్శనం తర్వాత కార్తీక పౌర్ణమి పర్వదినం నాడు అరుణాచలానికి చేరుకుంటారు.

అరుణాచల గిరి ప్రదక్షిణ ప్యాకేజీని http://tgsrtcbus.in వెబ్‌సైట్‌లో బుక్ చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు టీజీఎస్ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040-23450033, 040-69440000 సంప్రదించాలని టీజీఎస్ఆర్టీసీ సూచించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *