అమెరికా-భారత్ బంధం ట్రంప్ హయాంలో మరింత బలపడే అవకాశం: పీయూష్
ట్రంప్ హయాంలో భారత్‌కు అమెరికాతో మరింత బలమైన సంబంధాలు ఏర్పడతాయని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ప్రధాని మోదీకి, ట్రంప్ మధ్య ఉన్న సాన్నిహిత్యమే ఇందుకు కారణమని పీయూష్ గోయల్ చెప్పారు.
“ఒబామా, బైడెన్ ప్రభుత్వాలతో కలిసి పనిచేశాం. ఇరు దేశాల మధ్య బంధం మరింత బలపడుతూనే ఉంది. ట్రంప్ ప్రభుత్వంతో ఈ బంధం మరింత బలపడుతుందని నేను భావిస్తున్నాను” అని పీయూష్ అన్నారు. ట్రంప్ ప్రధాని మోదీని “అద్భుతమైన వ్యక్తి”, “డియర్ ఫ్రెండ్” అని సంబోధించడాన్ని పీయూష్ గుర్తు చేశారు. ప్రధాని మోదీ దేశీయంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా నేతలు, వ్యాపారవేత్తల నమ్మకాన్ని చూరగొన్నారని పీయూష్ అన్నారు.
“మోదీజీ నిష్కళంకంగా, నిజాయతీగా తన పని తాను చేసుకుంటూ వెళుతున్నారు. గత పదేళ్లలో ఆయన దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా పాపులర్ లీడర్‌గా అవతరించారు” అని పీయూష్ గోయల్ అన్నారు. ట్రంప్ విజయంలో కీలక భూమిక పోషించిన టెస్లా అధినేత ఎలాన్ మస్క్, వివేక్ రామస్వామికి ట్రంప్ కీలక బాధ్యతలను కట్ట్టబెట్టడంపై పీయూష్ సంతోషం వ్యక్తంచేశారు.
“వారు ప్రభుత్వ పాలనా వ్యవహారాల మెరుగుకు కృషి చేస్తారని ఆశిస్తున్నాము” అని పీయూష్ అన్నారు. మస్క్‌కు పెద్దపీట వేస్తున్న నేపథ్యంలో టెస్లా ప్రస్తావన రాగా.. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీని స్వాగతిస్తున్నామని పీయూష్ చెప్పారు.
దేశంలో వినియోగాన్ని పెంచేందుకు రేట్లు తగ్గించాలని పరిశ్రమ, వ్యాపారవర్గాలను పీయూష్ గోయల్ కోరారు. తద్వారా మార్కెట్లో డిమాండ్ పెంచవచ్చని చెప్పారు. ఇటీవల వెలువడిన త్రైమాసిక ఫలితాలను పరిశీలించినప్పుడు ఎఫ్ఎంసీజీ ఉత్పత్తుల విక్రయాలు తగ్గినట్లు వెల్లడైంది. ఈనేపథ్యంలో మంత్రి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
అలాగే, వృద్ధిని పెంచేందుకు ఆర్బీఐ సైతం కీలక రేట్లను తగ్గించాలని కోరగా.. ఇదే సదస్సులో పాల్గొన్న ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వచ్చే నెలలో జరిగే ఎంపీసీ భేటీ వరకు దీనిపై ఏమీ మాట్లాడదలుచుకోలేదంటూ నవ్వుతూ సమాధానం ఇచ్చారు.