ఐఫా వివాదం: తేజ సజ్జ, రానా స్పష్టత

ఐఫా అవార్డుల వేడుక హోస్టింగ్‌లో రానా దగ్గుబాటి, తేజ సజ్జ వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారి తీసిన సంగతి తెలిసిందే. ఈ వివాదంపై తేజ సజ్జ స్పందిస్తూ, అది ఒక జాతీయ స్థాయి వేడుక అని, అవకాశం దొరికితే మళ్ళీ వ్యాఖ్యాతగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ఐఫా అవార్డుల ప్రాముఖ్యతను గుర్తుచేస్తూ, స్క్రిప్ట్ రైటర్ల బృందం ద్వారా జాగ్రత్తగా తనిఖీ చేసిన తర్వాతే స్క్రిప్ట్ అందించారని వివరించారు. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నవి కేవలం కొన్ని క్లిప్స్ మాత్రమేనని, పూర్తి వీడియో చూస్తే ఎవరికీ అభ్యంతరం ఉండదని పేర్కొన్నారు. రానా తనపై చేసిన జోకులను ప్రేక్షకులు అర్థం చేసుకున్నారని, అందరూ వాటిని హాస్యంగానే తీసుకున్నారని వివరించారు. తనకు సినీ పరిశ్రమలో ఎన్నో సంవత్సరాల అనుభవం ఉందని, అన్ని స్థాయిల నటులతో పనిచేశానని, ఎవరినీ తక్కువచేసి మాట్లాడాలనే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేశారు. వ్యాఖ్యలను సరిగా అర్థం చేసుకోకపోవడం వల్లే ఈ వివాదం తలెత్తిందని తేజ అభిప్రాయపడ్డారు.

ఈ విషయంపై రానా దగ్గుబాటి కూడా స్పందించారు. “ది రానా దగ్గుబాటి షో” ట్రైలర్ విడుదల సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నాని తనకు ఇచ్చిన సలహాను గుర్తుచేస్తూ, ముందు ముందు జోకులు వేసేటప్పుడు “ఇది జోక్” అని స్పష్టంగా చెప్పాలని, లేదా సబ్‌టైటిల్‌తో జోడించాలని అన్నారు. సెప్టెంబర్‌లో అబుదాబిలో ఘనంగా జరిగిన ఐఫా అవార్డుల వేడుకలో రానా, తేజ హోస్ట్‌లుగా వ్యవహరించి, అగ్ర నటీనటులను ఉద్దేశించి సరదా వ్యాఖ్యలు చేశారు. అవి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *