ఆందోళనకర స్థితిలో రామ్మూర్తి నాయుడు ఆరోగ్య పరిస్థితి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సోదరుడు రామ్మూర్తి నాయుడు గారి ఆరోగ్యం విషమంగా మారింది. వారం రోజుల నుంచి అనారోగ్య కారణంగా హైదరాబాద్‌లోని AIG ఆసుపత్రిలో చికిత్స అందుకుంటున్నారు, అయితే ఈరోజు ఆయన ఆరోగ్యం మరింత క్షీణించింది. 1994 నుండి 1999 వరకు రామ్మూర్తి నాయుడు గారు చంద్రగిరి నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పనిచేశారు.
రామ్మూర్తి నాయుడు ఆరోగ్యం విషమమనే సమాచారం అందిన వెంటనే, మంత్రి నారా లోకేష్ ఏపీ అసెంబ్లీ నుంచి హుటాహుటిన హైదరాబాద్‌కు బయలుదేరారు. లోకేష్ గన్నవరం ఎయిర్పోర్ట్ నుండి హైదరాబాద్‌కు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో, ఢిల్లీ పర్యటనను వాయిదా వేసుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా త్వరలో హైదరాబాద్‌కు చేరుకునే అవకాశం ఉంది.
మహారాష్ట్ర ఎన్నికల ప్రచార పర్యటనను సీఎం చంద్రబాబు రద్దు చేసుకున్నారు. ఢిల్లీలో ఆంగ్ల దినపత్రిక కాంక్లేవ్‌లో పాల్గొన్న తర్వాత, చంద్రబాబు నేరుగా హైదరాబాద్‌కు రానున్నారు. ఆయన మధ్యాహ్నం AIG ఆసుపత్రిని చేరుకునే అవకాశం ఉంది. ఢిల్లీ పర్యటనలో చంద్రబాబు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిశారు.