పవన్ పోర్టు తనిఖీలపై పేర్ని నాని ప్రశ్నలు
కాకినాడ పోర్టులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేపట్టిన తనిఖీలపై మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర విమర్శలు గుప్పించారు. పవన్ కళ్యాణ్ పర్యటనకు అనుమతులు ఉన్నాయా అని ప్రశ్నించారు. పవన్ ఉన్న బోటులోనే కస్టమ్స్, పోర్టు అధికారులు ఉన్నారని, అయినా అనుమతులు లేవని పవన్ చెప్పడం ఏమిటని ఆయన నిలదీశారు. ఈ తనిఖీలు మంచి ప్రయత్నమే అని, అయితే అనుమానాలు కూడా ఉన్నాయని అన్నారు. పవన్‌కు చంద్రబాబు నాయుడు షిప్ ఎక్కొద్దని చెప్పారా? లేక పవన్ అబద్ధం చెబుతున్నారా? అని ఆయన ప్రశ్నించారు.
పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ, కాకినాడ పోర్టులో బియ్యం అక్రమ రవాణాపై తన ఆందోళనను వ్యక్తం చేశారు. స్టెల్లా షిప్‌పై మాత్రమే పవన్ దృష్టి పెట్టడంపై ఆయన అనుమానం వ్యక్తం చేశారు. మరో షిప్ కెన్ స్టార్‌పై ఎందుకు దృష్టి సారించలేదని ప్రశ్నించారు. కెన్ స్టార్ యజమాని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ వియ్యంకుడని, అందుకే పవన్ ఆ షిప్‌ను పట్టించుకోలేదని ఆరోపించారు. కెన్ స్టార్ 42 వేల టన్నుల పీడీఎస్ బియ్యం రవాణా చేస్తుందని ఆయన పేర్కొన్నారు. పవన్, కలెక్టర్ కెన్ స్టార్ షిప్‌ను ఎందుకు తనిఖీ చేయలేదని పేర్ని నాని ప్రశ్నించారు. బియ్యం అక్రమ రవాణాలో వైఎస్ జగన్, అరబిందో సంస్థల పాత్ర ఏమిటని ఆయన ప్రశ్నలు సంధించారు.