తిరుమల స్థానికులకు శ్రీవారి దర్శనం సులభం
తిరుమల శ్రీవారి దర్శనం కోసం స్థానికులకు ప్రత్యేక టోకెన్ల పంపిణీ ప్రారంభమైంది. తిరుపతిలోని టిటిడి ఛైర్మన్ బి.ఆర్. నాయుడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మహతి ఆడిటోరియంలో టిటిడి ఈవో శ్యామలరావుతో కలిసి ఆయన స్థానికులకు టోకెన్లు అందజేశారు. నవంబర్ 18న జరిగిన టిటిడి బోర్డు సమావేశంలో ప్రతి నెల మొదటి మంగళవారం స్థానికులకు ప్రత్యేక దర్శనం అవకాశం కల్పించాలని నిర్ణయించినట్లు బి.ఆర్. నాయుడు తెలిపారు.
తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో ఏడు, తిరుమల బాలాజీ నగర్లోని కమ్యూనిటీ హాల్లో మూడు కౌంటర్లు ఏర్పాటు చేశామని టిటిడి ఈవో శ్యామలరావు వెల్లడించారు. ప్రస్తుతం తిరుపతిలో 2500, తిరుమలలో 500 టోకెన్లు జారీ చేస్తున్నట్లు చెప్పారు. తిరుపతి అర్బన్, తిరుపతి రూరల్, చంద్రగిరి, రేణిగుంట, తిరుమల నివాసితులు తమ ఆధార్ కార్డుతో టోకెన్లు పొందవచ్చు. ప్రతి నెల మొదటి ఆదివారం రెండు కేంద్రాల్లోనూ టోకెన్ల పంపిణీ జరుగుతుంది. ఒక దర్శనం తర్వాత 90 రోజులు గడిచిన తర్వాతే తదుపరి దర్శనానికి అర్హత ఉంటుంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా క్యూలైన్లు, ఇతర ఏర్పాట్లు టిటిడి పూర్తి చేసింది. ఈ కార్యక్రమంలో తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని తదితరులు పాల్గొన్నారు.