అంతరిక్ష కాలుష్యం: భూ కక్ష్యలో పెరుగుతున్న ముప్పు
భూమి చుట్టూ తిరుగుతున్న ఉపగ్రహాలు, రాకెట్ శకలాలు అంతరిక్షంలో భారీ చెత్తను సృష్టిస్తున్నాయి. అమెరికాకు చెందిన స్లింగ్‌షాట్ ఏరోస్పేస్ సంస్థ అంచనాల ప్రకారం, ప్రస్తుతం భూమి దిగువ కక్ష్యలో 14,000కు పైగా ఉపగ్రహాలు, 12 కోట్లకు పైగా రాకెట్ శకలాలు ఉన్నాయి. ఇందులో 3,500 ఉపగ్రహాలు పనిచేయడం లేదు. కొన్ని శకలాలు భారీ ట్రక్కులంత పెద్దవిగా ఉన్నాయి. అంతరిక్ష వ్యర్థాల పెరుగుదలతో భూ కక్ష్యలో ఢీకొట్టుకునే ప్రమాదం పెరుగుతోంది. ఐక్యరాజ్యసమితి స్పేస్ ట్రాఫిక్ కో ఆర్డినేషన్ ప్యానెల్ ఈ విషయంలో తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఉపగ్రహాల నిర్వహణ, సమాచార మార్పిడిపై ప్యానెల్ చర్యలు తీసుకోవాలని సూచించింది. ప్రపంచ దేశాలు తమ ఉపగ్రహాల సమాచారాన్ని పంచుకోవడానికి ఇష్టపడకపోవడం కూడా ఈ సమస్యకు కారణం. భద్రతా కారణాలు, వాణిజ్య రహస్యాల రక్షణ ఇందుకు అడ్డంకులుగా ఉన్నాయి. చైనా, రష్యా రాకెట్లు, ఉపగ్రహాలు పేలిపోవడం వల్ల వేలాది శకలాలు అంతరిక్షంలోకి విస్తరించాయి. ఇది అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోని వ్యోమగాములకు ప్రమాదాన్ని కలిగించింది. భవిష్యత్తులో వేలాది ఉపగ్రహాల ప్రయోగం ఈ సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది. నార్త్‌స్టార్ ఎర్త్ అండ్ స్పేస్ సంస్థ అంచనా ప్రకారం, వచ్చే 5 సంవత్సరాల్లో ఈ అంతరిక్ష చెత్త వల్ల రూ.4,000 కోట్లకు పైగా నష్టం సంభవించే అవకాశం ఉంది. స్టార్ లింక్ ఉపగ్రహాలు 2024 మొదటి ఆరు నెలల్లోనే 50,000 సార్లు ఢీకొనడాన్ని తప్పించుకోవాల్సి వచ్చింది.