AI టెక్నాలజీ వలన ఉద్యోగ అవకాశాలు పెరుగుతున్నాయి!
భారతదేశంలో నిరుద్యోగులకు శుభవార్త! గత కొంతకాలంగా ఉద్యోగ నష్టాలతో ఇబ్బంది పడుతున్న ఉద్యోగులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం కాంతివంతమైన భవిష్యత్తును వెల్లడిస్తుంది. 2023 నుంచి 2028 వరకు దేశంలో 423.73 మిలియన్ల నుంచి 457.62 మిలియన్లకు శ్రామిక శక్తి పెరుగుతుందని ఓ నివేదిక ప్రకటించింది. ఈ పెరుగుదలలో 33.89 మిలియన్లు (3.39 కోట్లు) AI రంగం వల్లనే ఉంటాయని అంచనా. అంటే, వచ్చే ఐదేళ్లలో అనేక మంది యువతకు ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.
2028 నాటికి, AI ప్లాట్ఫాం ఫర్ బిజినెస్ ట్రాన్స్ఫర్మేషన్ అయిన సర్వీస్నౌ నిర్వహించిన కొత్త పరిశోధన ప్రకారం, AI దేశంలోని కీలక రంగాలలో నైపుణ్యాలకు కొత్త గుర్తింపును ఇస్తుంది. ఇది 2.73 మిలియన్ల కొత్త టెక్నాలజీ సంబంధిత ఉద్యోగాలను సృష్టిస్తుందని అంచనా. అంతేకాకుండా, రిటైల్ రంగం, తయారీ, విద్య, ఆరోగ్య రంగాలలో కూడా ఉద్యోగాలు పెరుగుతాయని అంచనా వేయబడింది.
“భారతదేశ అభివృద్ధిలో AI కీలక పాత్ర పోషిస్తుంది,” అని సర్వీస్నౌ ఇండియా టెక్నాలజీ అండ్ బిజినెస్ సెంటర్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, మేనేజింగ్ డైరెక్టర్ సుమీత్ మాథుర్ అన్నారు. “AI ద్వారా అధునాతన సాంకేతిక నైపుణ్యాల కోసం అధిక నాణ్యత గల అవకాశాలు సృష్టించబడుతున్నాయి. అంతేకాకుండా, డిజిటల్ కెరీర్లను నిర్మించడంలో AI యువతకు సహాయపడుతుంది.”
ఈ పరిణామాల వల్ల, సిస్టమ్స్ సాఫ్ట్వేర్ డెవలపర్లు, డేటా ఇంజనీర్లు, వెబ్ డెవలపర్లు, డేటా అనలిస్ట్లు, సాఫ్ట్వేర్ టెస్టర్లు, డేటా ఇంటిగ్రేషన్ స్పెషలిస్ట్, డేటాబేస్ ఆర్కిటెక్ట్, డేటా సైంటిస్ట్, కంప్యూటర్ మరియు ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ మేనేజర్ వంటి పోస్టుల కోసం కొత్త అవకాశాలు పెరుగుతాయి.