కెప్టెన్‌తో గొడవ! గ్రౌండ్ నుంచి బయటకు!
గల్లీ క్రికెట్‌లో చిన్న విషయాలకు గొడవలు జరుగుతాయని తెలిసిందే. క్యాచ్ పట్టలేదని, బౌండరీ వెళ్లలేదని, బౌలింగ్ ఇవ్వలేదని.. అలిగిపోయి మ్యాచ్‌లోనే మైదానం వీడేస్తారు. కానీ అంతర్జాతీయ మ్యాచ్‌లో కెప్టెన్‌తో గొడవపడి, మధ్యలోనే గ్రౌండ్ నుంచి బయటకు వచ్చిన ఘటన చూశారా?
ఇది నిజంగానే జరిగింది. బార్బడోస్‌లో వెస్టిండీస్, ఇంగ్లండ్ మధ్య జరిగిన మూడో వన్డేలో ఈ ఘటన చోటుచేసుకుంది. విండీస్ పేసర్ అల్జారీ జోసెఫ్ నాలుగో ఓవర్ వేస్తుండగా, తనకు కావలసినట్లుగా ఫీల్డ్ సెటప్ చేయమని కెప్టెన్ షై హోప్‌కు చెప్పాడు. కానీ హోప్ తన మాట వినకుండా, మరోలా సెట్ చేయడంతో జోసెఫ్‌కు మండిపడి కోపాన్ని బంతిపై చూపించాడు. నాలుగో బంతిని బౌన్సర్‌గా వేసి జోర్డాన్ కాక్స్‌ను అవుట్ చేశాడు. ఔట్ చేసిన తర్వాత కెప్టెన్‌పై మండిపడ్డాడు. నాలుగో ఓవర్‌ను పూర్తి చేసి, డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లిపోయాడు. వెస్టిండీస్ కోచ్ డారెన్ సామీ పిలుస్తున్నా, పట్టించుకోలేదు. కొద్దిసేపు డ్రెస్సింగ్ రూమ్‌లోనే కూర్చున్నాడు. డారెన్ సామీ అతడి వద్దకు వెళ్లి మాట్లాడంతో మళ్ళీ మైదానంలోకి వచ్చాడు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జోసెఫ్‌కు కొందరు మద్దతు ఇస్తుంటే, మరికొందరు విమర్శలు చేస్తున్నారు. ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ 8 వికెట్ల తేడాతో గెలిచి 2-1తో సిరీస్‌ను కైవసం చేసుకుంది.