అమరావతికి విద్యుత్ వెలుగులు: చంద్రబాబు చేతుల మీదుగా ఐదు సబ్స్టేషన్ల ప్రారంభం!
రాజధాని అమరావతి అభివృద్ధికి విద్యుత్ సరఫరా అత్యంత కీలకం. అందుకే కూటమి ప్రభుత్వం అమరావతి నిర్మాణాన్ని వేగవంతం చేయడంలో విద్యుత్ సరఫరాకు ప్రాధాన్యత ఇస్తోంది. గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన నిర్మాణాలను కూటమి సర్కార్ ఏర్పడిన తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యక్షంగా పరిశీలించి, నిపుణులను రంగంలోకి దింపి, పనులు పునఃప్రారంభం చేయించారు.
అమరావతిలో నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసం ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుంది. ఈ నేపథ్యంలోనే, గుంటూరు జిల్లా తాళ్లాయపాలెంలో నిర్మించిన 400/220కేవీ గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్ స్టేషన్ (జీఐఎస్) ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు ప్రారంభించనున్నారు.
రాష్ట్రంలో తొలిసారిగా ట్రాన్స్ మిషన్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ ద్వారా తాళ్లాయపాలెంలో 220/440 కేవీ విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు 220/132/33 కేవీ తాడికొండ కేంద్రం నుంచి అమరావతికి విద్యుత్తు సరఫరా అవుతుండగా.. తాళ్లాయపాలెం వద్ద నిర్మించిన 400/220 కేవీ విద్యుత్తు కేంద్రం పక్కనే 220/33 కేవీ విద్యుత్తు కేంద్రాన్ని నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ కేంద్రం నుంచి నేలపాడులో నిర్మించే 220/33 కేవీ విద్యుత్తు కేంద్రానికి సరఫరా చేయనున్నారు. తాడేపల్లిలోని 132 కేవీ కేంద్రాన్ని 220 కేవీగా అప్‌గ్రేడ్ చేసి తాళ్లాయపాలెం జీఐఎస్ నుంచి విద్యుత్ సరఫరా తీసుకుంటారు. తాళ్లాయపాలెం జీఐఎస్ కేంద్రం నుంచి రాజధాని అమరావతిలో నిర్మించబోయే 220/33 కేవీ విద్యుత్తు ఉపకేంద్రాలకు విద్యుత్ సరఫరా చేయనున్నారు.
మొత్తంగా, అంతరాయం లేకుండా రాజధాని అమరావతికి నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడం లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోంది. ఈ రోజు మొత్తంగా ఐదు సబ్స్టేషన్లను ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు, మరో 14 సబ్స్టేషన్లకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ సబ్స్టేషన్లు పరిశ్రమలు, ఆక్వాకల్చర్, వ్యవసాయ రంగాలు మరియు గృహాలకు మెరుగైన నాణ్యమైన విద్యుత్‌ను అందించగలవని అధికారులు తెలిపారు.