రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియా : పవన్ కల్యాణ్ హెచ్చరిక
ఆంధ్రప్రదేశ్‌లో డ్రగ్స్ పెనుముప్పుగా మారిందని, దీనిని అరికట్టేందుకు ప్రత్యేక దృష్టి అవసరమని జనసేన అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హెచ్చరించారు. “రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియా, గంజాయి సాగు, సంబంధిత నేర కార్యకలాపాలను అరికట్టేందుకు ప్రత్యేక దృష్టి అవసరం” అని, మునుపటి ప్రభుత్వం అవినీతి పాలన నుండి సంక్రమించిన మరొక వారసత్వ సమస్యగా దీనిని పేర్కొన్నారు.
కొంతకాలం క్రితం విశాఖపట్నం పోర్టులో కొకైన్ షిప్‌మెంట్ స్వాధీనం చేసుకోవడం, దేశంలోని ఇతర చోట్ల పట్టుబడిన డ్రగ్స్‌కు విజయవాడలోని ఒక వ్యాపార సంస్థతో సంబంధాలు ఉన్నాయని, గత పాలనలో డ్రగ్ మాఫియా బాగా అభివృద్ధి చెందిందని పవన్ కల్యాణ్ గుర్తుచేశారు. ఈ నేరగాళ్లను కట్టడి చేసేందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.
కాగా, ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం డ్రగ్స్‌తో పాటు గంజాయిని కట్టడి చేసేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్న విషయం విదితమే. రాష్ట్రస్థాయిలో యాంటీ నార్కొటిక్స్ టాస్క్‌ఫోర్స్ (ఏఎన్‌టీఎఫ్), జిల్లాకొకటి చొప్పున మొత్తం 26 నార్కొటిక్స్ కంట్రోల్ సెల్స్ ఏర్పాటుకు మంత్రివర్గం ఉపసంఘం ఆమోదం తెలిపింది. డీజీపీ పర్యవేక్షణలో ఐజీ స్థాయి అధికారి నేతృత్వంలో ఏఎన్‌టీఎఫ్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
పవన్ కల్యాణ్ డ్రగ్స్‌పై ట్వీట్ చేసిన నేపథ్యంలో, కూటమి ప్రభుత్వం తర్వాత డ్రగ్స్, గంజాయి కట్టడిపై దృష్టి సారించనున్నట్టు తెలుస్తోంది.