గత వైసీపీ పాలకులపై బీసీ జనార్దన్ రెడ్డి తీవ్ర విమర్శలు
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాష్ట్రాన్ని నిర్లక్ష్యం చేసిందని, అభివృద్ధి పనులను నిర్వహించడంలో విఫలమైందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలోని రహదారుల దుస్థితిని చూపిస్తామని, వైసీపీ ఎమ్మెల్యేలు శాసనసభకు రాకుండా పారిపోతున్నారని ఎద్దేవా చేశారు.
“ప్రజలు మిమ్మల్ని శాసనసభకు రావడానికి గెలిపించారు. కానీ, మీరు రోడ్ల గురించి, పోర్టుల గురించి, ప్రజల గురించి ఏమీ మాట్లాడటం లేదు. మీరు శాసనసభకు రాకుండా పారిపోతున్నారు. మీరు ఎందుకు పారిపోతున్నారో అర్థం కావడం లేదు,” అని జనార్దన్ రెడ్డి అన్నారు.
గుంతల్లో చిడతల బేరం పేరుతో మీడియాలో వస్తున్న కథనాలను ఉదహరించి, 2014-19 మధ్యలో 11 వేల కోట్లు ఖర్చు చేశామని, కానీ 2019-24 వరకు ఏడు వేల కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారని, బకాయిలు చెల్లించడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని ఆయన ఆరోపించారు.
“రోడ్లు బాగోలేకపోవడంతో ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటక రంగం కుదేలైపోయింది. ఎంతో మంది ప్రమాదాలకు గురవుతున్నారు. పక్క రాష్ట్రాల మంత్రులు సైతం ఆంధ్రప్రదేశ్‌లోని రహదారుల గురించి జోకులు వేసుకుంటున్నారు,” అని జనార్దన్ రెడ్డి అన్నారు.
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో పరిశ్రమలు తరలిపోయాయి, పెట్టుబడులు ఆగిపోయాయి అని, రాష్ట్రంలోని పోర్టులను ప్రైవేటీకరణ చేయబోతున్నారని వైసీపీ దుష్ప్రచారం చేస్తుందని ఆయన విమర్శించారు.
“వైసీపీ పాలకులు గతంలో ప్రభుత్వ వాటాను ప్రైవేటు వ్యక్తులకు, బినామీ కంపెనీలకు కట్టబెట్టారు. వైసీపీ పాలనలో రహదారుల దుస్థితిపై ప్రజల్లో చర్చ జరిగింది,” అని జనార్దన్ రెడ్డి అన్నారు.