370 రద్దు: జమ్మూకశ్మీర్ అసెంబ్లీలో తీవ్ర ఉద్రిక్తత
జమ్మూకశ్మీర్‌కు స్వయంప్రతిపత్తిని కల్పించే 370వ అధికరణను పునరుద్ధరించాలని కోరుతూ బుధవారం జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ఎన్నికైన ప్రజాప్రతినిధులతో కేంద్రం చర్చలు జరపాలని తీర్మానం డిమాండ్ చేసింది.
ఈ తీర్మానంపై విపక్ష బీజేపీ సభ్యులు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేయడంతో అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. చర్చ లేకుండా స్పీకర్ మూజువాణి ఓటుతో తీర్మానాన్ని ఆమోదించారు. ఉప ముఖ్యమంత్రి సురిందర్ కుమార్ చౌదరి తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.
“2019లో జమ్మూకశ్మీర్ నుండి ఊడపీక్కున్న ప్రత్యేక ప్రతిపత్తి విషయమే మేము చర్చిస్తున్నాము. బీజేపీకి నార్కో టెస్ట్ చేస్తే వాళ్లు కూడా ఇదే మాట అంటారు” అని చౌదరి బీజేపీపై మండిపడ్డారు.
జమ్మూకశ్మీర్‌లో బయట నుంచి వచ్చిన వారు ఆస్తులు కొనుగోలు చేస్తుండటంతో కేంద్ర పాలిత ప్రాంత ప్రజలు ఇబ్బందులపాలవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బయట నుంచి వచ్చిన వారు ఉద్యోగాలు పొందుతున్నారని కూడా ఆయన చెప్పారు. జమ్మూకశ్మీర్ ప్రజల భవిష్యత్తును కాపాడేందుకే ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టినట్లు ఆయన వివరించారు.
“బీహార్, ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని బీజేపీ ప్రామిస్ చేసింది. అసెంబ్లీలో రాముడి పేరు తెచ్చారు. వాళ్లకు మేము చెప్పదలచుకున్నది ఒకటే. ప్రతి ఒక్కరికీ హక్కులు ఉంటాయి. జమ్మూకశ్మీర్‌కు కూడా స్పెషల్ స్టాటస్ కావాలి. లెఫ్టినెంట్ గవర్నర్ హయాంలో రాజౌరి, చినాబ్ వ్యాలీ, కథువా, సాంబాలో ఉగ్రవాదాన్ని తుడిచిపెట్టారా?” అని చౌదరి ప్రశ్నించారు.
తీర్మానం ప్రకారం, జమ్మూకశ్మీర్‌కు స్వయంప్రతిపత్తిని కల్పించే 370వ అధికరణను తొలగించడం ఏకపక్షమని పేర్కొంది. “జమ్మూకశ్మీర్ ప్రజల గుర్తింపు, సంస్కృతి, హక్కుల పరిరక్షణకు రాజ్యాంగ పరమైన హామీలను ప్రత్యేక ప్రతిపత్తి కల్పించింది. దీని ప్రాధాన్యతను మరోసారి లెజిస్లేటివ్ అసెంబ్లీ బలంగా చాటుతోంది. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక పత్రిపత్తి కల్పించే 370వ అధికరణను ఏకపక్షంగా తొలగించడంపై ఆందోళన వ్యక్తం చేస్తోంది” అని తీర్మానం తెలిపింది.
ఈ తీర్మానాన్ని బీజేపీ విపక్ష నేత సునీల్ శర్మతో సహా ఆ పార్టీ సభ్యులు వ్యతిరేకించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని సునీల్ శర్మ అన్నారు. లెఫ్టినెంట్ గవర్నర్ ప్రసంగంపై చర్చ అని తమకు చెప్పి సభలో ఈ తీర్మానం ప్రవేశపెట్టడం ఏమిటని ప్రశ్నించారు.
తీర్మానానికి నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ మద్దతు పలికాయి. విపక్ష సభ్యులు మాట్లాడడానికి ముందుకు రాకపోతే ఓటింగ్ పెడతానని స్పీకర్ అబ్దుల్ల రహీమ్ పేర్కొన్నారు. విపక్ష సభ్యులు వెనక్కి తగ్గకపోవడంతో మూజువాణి ఓటుకు ఆయన ఆదేశించారు.
2019లో నరేంద్ర మోదీ ప్రభుత్వం 370వ అధికరణను రద్దు చేసి, జమ్మూకశ్మీర్ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది.