బీసీ డిక్లరేషన్: కేటీఆర్ VS పొన్నం – ఎవరి మాట నిజం?

బీసీల అభివృద్ధి కోసం కాంగ్రెస్ హామీలు నెరవేరలేదని, కేవలం ఓట్ల కోసం అబద్ధాలు చెబుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు బేషరుతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రంగా స్పందించారు. కేటీఆర్కు బీసీల గురించి మాట్లాడే అర్హత ఉందా అని ప్రశ్నించారు.

కార్తీక సోమవారం సందర్భంగా వేములవాడలో శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకున్న తర్వాత మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం చేపడుతోన్న సమగ్ర కుటుంబ సర్వే ప్రజలను ఇబ్బంది పెట్టేందుకు కాదని పొన్నం స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష పదవి, కార్యనిర్వహక పదవి, ప్రతిపక్ష పదవి బీసీ లకు, ఎస్సీలకు ఇవ్వాలని పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు అన్యాయం చేసిన బీఆర్ఎస్ మాట్లాడే అర్హత ఎక్కడిదని ప్రశ్నించారు.

రేవంత్ రెడ్డి నాయకత్వంలో జరుగుతున్న కుల సర్వే దేశ వ్యాప్తంగా జరగాలని డిమాండ్ ఉందని, బీజేపీ, బీఆర్ఎస్లు సర్వేను అప్రతిష్టపాలు చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. రాజకీయ పార్టీల రెచ్చగొట్టే వ్యాఖ్యలకు ప్రభావితం కావద్దని ప్రజలను కోరారు.

కేటీఆర్ మాట్లాడుతూ, బీసీలను వెన్నుపోటు పొడిచిన కాంగ్రెస్ పార్టీ ఏడాది కిందట ప్రకటించిన బీసీ డిక్లరేషన్ను అమలు చేయడంలో విఫలమైందని, ఓట్ల కోసం దొంగ హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ఒక్క బీసీ డిక్లరేషన్ హమీ అయినా అమలు చేసిందా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో కులగణన పూర్తయిన తరువాత, బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. 42% రిజర్వేషన్లు అమలు చేయాలని ఇంటింటి సర్వేకు వచ్చే అధికారులను, ప్రజాప్రతినిధులను నిలదీయాలని పిలుపునిచ్చారు.

మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో తెలంగాణ రైతులకు పంటపై బోనస్ రూ.500లు ఇస్తున్నామని రేవంత్ రెడ్డి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఒక్క బీసీకైనా వడ్డీ లేని రూ.10లక్షల రుణం ఇచ్చారా అని ప్రశ్నించారు. ఐదేళ్లలో బీసీల సంక్షేమం కోసం ఏటా రూ.20వేల కోట్ల చొప్పున ఐదేళ్లలో లక్ష కోట్లు కేటాయిస్తామని ప్రకటించిన కాంగ్రెస్ తొలి ఏడాది బడ్జెట్లో కేవలం రూ.8వేల కోట్లే ప్రకటించిందని, అవికూడా ఇప్పటివరకు విడుదల చేయలేదని విమర్శించారు. బీసీ వెల్ఫేర్తో పాటు ఎంబీసీలకు మరో మంత్రిత్వశాఖను ఏర్పాటు చేస్తామని హమీ ఇచ్చారని, కొత్త మంత్రిత్వశాఖను ఏర్పాటు చేస్తా అంటే ఎవరు నమ్ముతారని కేటీఆర్ ప్రశ్నించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *