బుద్దా వెంకన్న – విజయసాయి రెడ్డిపై విరుచుకుపడ్డారు!
వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డిపై టీడీపీ నేత బుద్దా వెంకన్న తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. విజయసాయి రెడ్డిని “చిత్తకార్తి కుక్క” అంటూ సంబోధిస్తూ, ఆయన మళ్ళీ మొరుగుతున్నారని బుద్దా వెంకన్న ఎద్దేవా చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ, ఉత్తరాంధ్రలో కూటమి అభ్యర్థులు 32 సీట్లు గెలిచారని, విజయసాయి రెడ్డి వల్ల వైసీపీ రెండు సీట్లకే పరిమితమైందని బుద్దా వెంకన్న వివరించారు. “జగన్‌కు పాఠాలు నేర్పే ఆర్థిక నేరస్తుడు విజయసాయి” అంటూ ఆయన విమర్శించారు.
శాంతి వ్యవహారంలో విజయసాయి రెడ్డి అసహనంగా ఉన్నారని, అందుకే ఇప్పుడు నోరు పారేసుకుంటున్నారని బుద్దా వెంకన్న విమర్శించారు. మీడియా రిపోర్టర్లను ఇష్టం వచ్చినట్లు దూషించిన సంస్కారహీనుడు విజయసాయి అని, అతను చదువుకున్న మూర్ఖుడని బుద్దా వెంకన్న ఆరోపించారు. “శాంతి భర్త నీ మీద చేసిన వ్యాఖ్యలకు ఏం సమాధానం చెబుతావు? మీడియా కూడా ఆయన చెప్పినవే రాసింది కదా?” అంటూ విజయసాయి రెడ్డిని బుద్దా వెంకన్న ప్రశ్నించారు.
మంద కృష్ణమాదిగ చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి ఎక్స్‌లో పోస్టు పెట్టి, కూటమిలో చిచ్చు పెట్టాలని శకునిలా తాపత్రయ పడుతున్నారని బుద్దా వెంకన్న ఆరోపించారు. బాలయ్య షోలో చంద్రబాబు తనకు పవన్‌పై ఉన్న అభిమానాన్ని వ్యక్తం చేశారని బుద్దా వెంకన్న తెలిపారు. 2027లో మళ్ళీ వైసీపీ ప్రభుత్వం వస్తుందని విజయసాయి రెడ్డి కలలు కంటున్నారని బుద్దా వెంకన్న ఎద్దేవా చేశారు. “జమిలీ ఎన్నికలపై ఇంకా చట్టం చేయలేదు, పార్లమెంట్లో బిల్లు పాస్ అవ్వాలి” అని బుద్దా వెంకన్న స్పష్టం చేశారు.
“వైసీపీలో పెరిగిన వలసలు ఆపేందుకే విజయసాయి రెడ్డి ఇటువంటి ప్రకటనలు చేస్తున్నాడు” అని బుద్దా వెంకన్న విమర్శించారు. షర్మిల తన కొడుకు పెళ్లికి చంద్రబాబుకు ఆహ్వానపత్రిక ఇవ్వడానికి వెళితే, ఆమె పసుపు చీర కట్టుకుని ఆకర్షించిందని విజయసాయి రెడ్డి వాగాడని, “ఆకర్షించడం అంటే ఎన్ని అర్ధాలు వస్తాయో నీకు తెలుసారా చిత్తకార్తి కుక్కా?” అని బుద్దా వెంకన్న అన్నారు. “వైఎస్ దయతో ఎదిగిన నువ్వు, అదే వైఎస్ బిడ్డపై నీచంగా మాట్లాడతావా?” అని బుద్దా వెంకన్న నిలదీశారు. “వైసీపీ నేతలకు, అభిమానులకు రోషం, పౌరుషం ఉందా? విజయసాయి రెడ్డికి బుద్ధి చెప్పే ధైర్యం మీకు లేదా? రెండు చెంపలు పగులకొట్టకుండా, పార్టీలో ఉంచుకుని, పెత్తనం ఇస్తారా?” అని బుద్దా వెంకన్న ప్రశ్నించారు.
లోకేష్ బాబు జూమ్ మీటింగ్‌లో కొడాలి నాని, వంశీలను నీ ఇంట్లో ఉంచి తీసుకొచ్చావు. ఆనాడు అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా వ్యవహరించడం కాదు. ఇప్పుడు దమ్ముంటే రండి జూమ్ మీటింగ్‌లోకి చూద్దాం” అని బుద్దా వెంకన్న సవాల్ విసిరారు. “చంద్రబాబుపై ఇష్టం వచ్చినట్లు పోస్టులు పెడుతున్న విజయసాయి రెడ్డి, నీకు సిగ్గు, శరం ఉందా? 16 నెలలు జైల్లో ఉన్న విజయసాయి రెడ్డి, మళ్ళీ అవినీతిపై జైలుకు వెళ్లడం ఖాయం” అని బుద్దా వెంకన్న స్పష్టం చేశారు.
“ఈ చిత్తకార్తి కుక్క ఎన్ని వేషాలు వేసినా శిక్ష తప్పదు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ నుంచి మొరుగడం కాదు ఇక్కడికి రా. ఈసారి నేను కూడా హైదరాబాద్ ప్రెస్ క్లబ్ కే వచ్చి నీ సంగతి చెబుతాను. ఎక్స్‌లో ఇష్టం వచ్చినట్లు పోస్టు పెడితే, నీకు దేహశుద్ధి తప్పదు. జగన్ ఇక్కడ అధికారంలోకి రాడు. కలలు కనడం మానుకో” అని బుద్దా వెంకన్న హెచ్చరించారు. “నేను చంద్రబాబుకు విధేయుడిని, పార్టీ కోసం పనిచేస్తాను. నాకు పదవి ఇచ్చినా తీసుకుంటాను, కాదన్నా నేను నా పని నేను చేస్తాను. నాకు వ్యక్తిగత ఎజెండాలు లేవు. చంద్రబాబు ఎజెండానే నా ఎజెండా” అని బుద్దా వెంకన్న చెప్పారు.