బస్సు దొంగతనం: ఒడిశాలో షాకింగ్ ఘటన!
బైకులు, స్కూటీలు దొంగతనాలు వినడం సర్వసాధారణం, కార్లు దొంగతనాలు కూడా వినపడుతూనే ఉంటాయి. కానీ బస్సు దొంగతనం గురించి ఎప్పుడైనా విన్నారా? ఒడిశాలో ఈ షాకింగ్ ఘటన జరిగింది. డ్రైవర్ చేసిన చిన్న తప్పు వల్ల బస్సు చోరీకి గురైంది. దొంగలు బస్సును దొంగలిస్తున్న దృశ్యం సీసీటీవీ కెమెరాలో చిక్కింది. షాక్‌కు గురైన బస్సు యజమాని వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన సోషల్ మీడియాలో తెగ చర్చనీయాంశంగా మారింది.
ఒడిశాలోని గంజాం జిల్లా భంజానగర్‌లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ‘మా దుర్గ’ అనే ప్రైవేట్ కంపెనీకి చెందిన బస్సును దొంగలు రాత్రివేళ దొంగలించారు. డ్రైవర్ బస్సు తాళాలను లోపలే వదిలేసి స్టాండ్‌లో పార్క్ చేసి ఇంటికి వెళ్లిపోయాడు. అతని నిర్లక్ష్యం చూసి దొంగలు బస్సు ఎక్కి దాన్ని తీసుకెళ్లిపోయారు. బస్సు కనిపించకపోవడంతో యజమాని షాక్‌కు గురయ్యాడు. సీసీటీవీ ఫుటేజ్ చూడగా అసలు విషయం బయటపడింది. కన్నీరు పెట్టిన యజమాని వెంటనే భంజానగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.
యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు. అన్ని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. సుదీర్ఘ విచారణ తర్వాత, బెర్హంపూర్ జిల్లాలోని ఛత్రపూర్ సమీపంలోని జాతీయ రహదారిపై బస్సును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే దొంగలను ఇంకా గుర్తించలేదు. దొంగల కోసం పోలీసులు గాలిస్తున్నారు.