తమిళనాడులో వైద్యుడిపై దాడి: ముఖ్యమంత్రి స్టాలిన్ స్పందన!
చెన్నైలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ వైద్యుడిపై జరిగిన దాడి తమిళనాడులో తీవ్ర సంచలనం సృష్టించింది. ఆంకాలజీ విభాగంలో పనిచేస్తున్న డాక్టర్ బాలాజీ జగన్నాథన్‌ను, తన తల్లి చికిత్సకు అసంతృప్తిగా ఉన్న ఓ యువకుడు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు.
నిందితుడు బుధవారం ఉదయం ఆసుపత్రికి పేషంట్‌లా వచ్చి, డాక్టర్‌ను కత్తితో పొడిచి పారిపోవడానికి ప్రయత్నించాడు. ఆసుపత్రి సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. నిందితుడి తల్లి ఆసుపత్రిలో క్యాన్సర్ చికిత్స తీసుకుంటున్నారు.
ఆమె పరిస్థితి మెరుగుపడకపోవడంతో ఆమె కుమారుడు డాక్టర్ బాలాజీ జగన్నాథన్‌పై కక్ష పెంచుకుని ఈ దాడికి పాల్పడ్డాడని భావిస్తున్నారు. తీవ్రంగా గాయపడిన డాక్టర్ బాలాజీ పరిస్థితి విషమంగా ఉందని ఆసుపత్రి డైరెక్టర్ వెల్లడించారు. ఈ దాడిని వైద్యులు తీవ్రంగా ఖండించారు.
దీనిపై ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ స్పందించారు. దాడిని తీవ్రంగా ఖండిస్తూ విచారణకు ఆదేశించారు. “సమయంతో నిమిత్తం లేకుండా సేవలు అందిస్తోన్న వైద్యుల కృషి ఎనలేనిది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని” హామీ ఇచ్చారు. ఈ దాడితో వైద్యుల భద్రతపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది.