పంట వ్యర్థాల దహనంపై జరిమానాలు రెట్టింపు!
ఢిల్లీలో గాలి కాలుష్యం ప్రతిరోజూ తీవ్రమవుతూ, ప్రజల ఆరోగ్యాన్ని బలిగొంటున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తీవ్ర చర్యలకు దిగింది. పంట వ్యర్థాలను తగలబెట్టే రైతులకు విధించే జరిమానాలను రెట్టింపు చేస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.
పొరుగు రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను దహనం చేసే రైతులకు గతంలో విధించే జరిమానా రూ. 15,000 నుంచి రూ. 30,000 కు పెంచబడింది. ఈ నిబంధనలు వెంటనే అమల్లోకి వస్తాయని కేంద్రం స్పష్టం చేసింది.
ఈ కొత్త నిబంధనల ప్రకారం, రెండు ఎకరాలలోపు భూమి ఉన్న రైతులకు 5 వేల రూపాయల జరిమానా విధిస్తారు. 2 నుంచి 5 ఎకరాల భూమి ఉన్న రైతులకు రూ. 10 వేలు, 5 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్న రైతులకు రూ. 30 వేలు జరిమానా విధించనున్నారు.
ఢిల్లీలో పంట వ్యర్థాల దహనం వల్ల ఏర్పడే కాలుష్యంపై సుప్రీంకోర్ట్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి, మోడీ ప్రభుత్వానికి చీవాట్లు పెట్టింది. ఈ నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.
శీతాకాలంలో దేశ రాజధాని ఢిల్లీని కాలుష్య కోరల్లోకి నెట్టేస్తున్న పంట వ్యర్థాల దహనం ఘటనలను అరికట్టడానికి కేంద్రం తీసుకుంటున్న ఈ చర్యలు ఫలిస్తాయో లేదో చూడాలి.
సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ తెలిపిన వివరాల ప్రకారం, ఢిల్లీ- ఎన్సీఆర్ పరిధిలో గాలి నాణ్యత ఈరోజు (గురువారం) భారీగా పడిపోయింది. పలు ప్రాంతాల్లో వాయు కాలుష్యం తీవ్ర స్థాయికి చేరింది. రాజధాని నగరంలో సగటు వాయు నాణ్యత సూచిక 362గా నమోదు అవ్వగా.. ఢిల్లీలోని అనేక ప్రాంతాలు 400 మార్కును దాటేసింది.