ధోని మ్యాజిక్: ఖాతాబుక్తో మరో విజయం!
టీమిండియా లెజెండ్ మహేంద్ర సింగ్ ధోని అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పి చాలా కాలమే అయింది. అయినా అతని ప్రభావం ఏమాత్రం తగ్గలేదు. పైగా ఏటా తన జనాదరణను మరింత పెంచుకుంటూనే ఉన్నాడు. ఐపీఎల్లో మాత్రమే బ్యాట్ పట్టి అరేనాలో దూసుకుపోయే మాహీ.. మిగతా సమయం అంతా యాడ్స్, బిజినెస్ వ్యవహారాలు, ఫామ్‌హౌస్‌లో వ్యవసాయం చేస్తూ బిజీగా గడుపుతాడు. ఐపీఎల్, ప్రకటనల ద్వారానే కాదు.. పలు వ్యాపార సంస్థల్లో భాగస్వామ్యం, చిన్న కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా తన ఆదాయాన్ని అతను రెట్టింపు చేసుకుంటున్నాడు.
అలాంటి ధోని ఏది ముట్టుకున్నా బంగారమేనని మరోసారి రుజువైంది. ఒక చిన్న సాయంతో పెద్దగా ఎవరికీ తెలియని ఓ స్టార్టప్ కంపెనీకి వేల కోట్ల టర్నోవర్ వచ్చి పడేలా చేశాడు ధోని. బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు సాగించే ‘ఖాతాబుక్’ అనే స్టార్టప్ సంస్థకు ధోని మొదటి నుంచి అండగా నిలిచాడు. ఆశిష్ సోనోన్, ధనేష్ కుమార్, వైభవ్ కల్పే, జైదీప్ పూనియా, రవీష్ నరేష్‌లు కలసి 2018లో ఈ కంపెనీని ప్రారంభించారు. ఆన్లైన్ చెల్లింపులకు సంబంధించిన ఈ సంస్థలో భారీగా పెట్టుబడులు పెట్టాడు మాహీ. అతని నమ్మకం వమ్ము కాలేదు. గత ఏడాది ఆ కంపెనీ విలువ ఏకంగా రూ.4,500 కోట్లకు చేరింది.
ధోని ఖాతాబుక్లో పెట్టుబడులు పెట్టడమే గాక టీమ్‌తో ఎప్పటికప్పుడు సపోర్టివ్‌గా ఉంటూ వచ్చాడట. అతని నమ్మకం, సంస్థకు అతడు ఇచ్చిన భరోసా, వెనుక నుంచి నడిపించడం వృథా కాలేదు. ఆ కంపెనీ తక్కువ కాలంలోనే వేల కోట్ల సంస్థగా మారింది. దీంతో మాహీ ఏది పట్టుకున్నా బంగారమేనని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కాగా, ధోని అనే కాదు.. ఈ మధ్య కాలంలో చాలా మంది సెలెబ్రిటీలు చిన్న చిన్న అంకుర సంస్థల్లో పెట్టుబడులు పెడుతున్నారు. అయితే వాటిల్లో కొన్ని మాత్రమే విజయవంతం అవుతున్నాయి. ఇక, మరో ఐపీఎల్ సీసన్ ఆడేందుకు ధోని సిద్ధమైపోయాడు. ఇటీవల రిటెన్షన్ ప్రక్రియ సమయంలో అతడ్ని రూ.4 కోట్లు పెట్టి అట్టిపెట్టుకుంది చెన్నై సూపర్ కింగ్స్.