కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి: అక్రమాలపై అధికారుల కొరడా
ధర్మవరంలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి అక్రమాలపై అధికారులు తీవ్రంగా స్పందించారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్రలో కేతిరెడ్డి ప్యాలెస్ లపై సెల్ఫీ చాలెంజ్ విసిరిన విషయం తెలిసిందే. టీడీపీ అధికారంలోకి రాగానే గుడ్ మార్నింగ్ స్టార్ అక్రమాలపై చర్యలు తీసుకుంటామని లోకేష్ ప్రకటించారు.
ధర్మవరం చెరువును ఆక్రమించి ఫామ్ హౌస్ నిర్మించారని లోకేష్ ఆరోపిస్తూ, పాదయాత్రలో సెల్ఫీ చాలెంజ్ విసిరారు. అనంతరం, చెరువును ఆక్రమించి నిర్మించిన ప్యాలెస్ ను వారం రోజుల్లో ఖాళీ చేయాలంటూ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి మరదలు గాలి వసుమతికి రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేశారు. ప్రభుత్వ భూమితో పాటు చెరువును కబ్జా చేసినట్లు అధికారులు నిర్ధారించారు.
దాదాపు 30 ఎకరాలు ఆక్రమణకు గురైనట్లు అధికారులు గుర్తించారు. ధర్మవరం రెవెన్యూ పరిధిలోని సర్వేనెంబర్ 904, 905, 908 లలో రైతుల నుంచి 25 ఎకరాలు గాలి వసుమతి కొనుగోలు చేసినట్లు అప్పటి రెవెన్యూ అధికారులు రికార్డుల్లోకి ఎక్కించారు. అయితే, ఈ సర్వే నంబర్లకు ఆనుకుని ఉన్న 908, 909, 910, 616-1 సర్వే నంబర్ల పరిధిలోనే దాదాపు 20 ఎకరాల భూమిని ఆక్రమించినట్లు అధికారులు గుర్తించారు.
కొన్న 20 ఎకరాలు, ఆక్రమించుకున్న 20 ఎకరాలు కలిపి మొత్తం 45 ఎకరాలలో విలాసవంతమైన ఫామ్ హౌస్, రేస్ ట్రాక్ గుర్రాల కోసం షెడ్లు, చెరువులో బోటింగ్ కోసం సదుపాయాలు ఏర్పాటు చేసుకున్నారు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి. తన తమ్ముడు కృష్ణారెడ్డి భార్య గాలి వసుమతి పేరుతో రిజిస్ట్రేషన్లు చేయించారు. ధర్మవరం మండల పరిధిలోని మల్లా కాలువ గ్రామంలో సైతం 10 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించినట్లు అధికారులు గుర్తించారు. ఆక్రమించిన భూములపై పది రోజుల్లోపు వివరణ ఇవ్వాలంటూ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డికి నోటీసులు జారీ చేశారు.