మంచిర్యాల ఎమ్మెల్యేకు భద్రతా బందోబస్తు పెంపు
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గడ్డం వినోద్ కు భద్రతను పెంచారు. మావోయిస్టు కోల్ బెల్ట్ కార్యదర్శి ప్రభాత్ హెచ్చరిక లేఖ తర్వాత, ఎమ్మెల్యే కార్యాలయం భద్రతను పటిష్టం చేయడానికి అధికారులు చర్యలు తీసుకున్నారు.
ఎమ్మెల్యే కార్యాలయ గేటు వద్ద డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్‌ని ఏర్పాటు చేశారు. బాంబు స్క్వాడ్‌ను కూడా అందుబాటులో ఉంచారు. ఎమ్మెల్యే ప్రయాణాల సమయంలో రోప్ పార్టీ టీం, సీఐ స్థాయి అధికారితో ఎస్కార్ట్ ఏర్పాటు చేశారు. భద్రతను మరింత బలోపేతం చేస్తూ, త్రీ ప్లస్ త్రీ గన్‌మెన్ స్థాయికి పెంచారు. కార్యాలయం వద్ద ఎస్ఐ స్థాయి అధికారితో భద్రతా పర్యవేక్షణ నిర్వహించారు.
నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎక్కడికి వెళ్లినా రోప్ పార్టీ ఆయన వెంటే ఉంటుంది. గురువారం తాండూరు, కాశిపేట మండలాల్లో ప్రభుత్వ కార్యక్రమాలకు హాజరవుతుండగా, రోప్ పార్టీ భద్రతా చర్యలు చేపట్టారు. బెల్లంపల్లి ఏఎంసీ పరిధిలోని క్యాంపు కార్యాలయంలో బాంబ్ స్క్వాడ్, మెటల్ డిటెక్టర్‌ను ఏర్పాటు చేశారు. ప్రవేశ ద్వారం వద్ద మెటల్ డిటెక్టర్‌తో స్క్రీనింగ్ చేసిన తర్వాత మాత్రమే సందర్శకులను అనుమతించనున్నారు పోలీసులు.