జామ ఆకుల ఆరోగ్య ప్రయోజనాలు మరియు ఉపయోగాలు!
జామ పండ్లు ఆరోగ్యానికి ఎంతో మంచివని తెలిసిందే. అవి పోషకాలతో నిండి ఉంటాయి, అందుకే వాటిని “పేదవాడి యాపిల్” అంటారు. రోజూ జామ పండ్లు తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది, రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి మరియు రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది. కానీ జామ పండ్లు మాత్రమే కాదు, జామ ఆకులు కూడా అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నాయని మీకు తెలుసా?
జామ ఆకులను ఆహారంలో వాడడం ఎప్పటినుంచో వస్తున్న పద్ధతి. చిన్నతనంలో చాలా మంది జామ ఆకు కిళ్ళీ తినేవారు. ఉప్పు, జీలకర్ర, చింతపండుతో చేసిన చిన్న గోళీని జామ ఆకులో చుట్టి తినడం ఎంత రుచిగా ఉంటుందో!
రోజూ 5 జామ ఆకులను వినియోగించడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది. జామ ఆకులతో చేసిన టీ, గ్రీన్ టీ కంటే మరింత శక్తివంతమైనది. జామ ఆకులను నీడలో ఎండబెట్టి నిల్వ చేసుకోవచ్చు. వేడి నీటిలో ఎండిన జామ ఆకులను వేసి 5 నుండి 10 నిమిషాల పాటు మరిగించి, ఫిల్టర్ చేసి వేడివేడిగా తాగాలి. రుచి కోసం నిమ్మరసం లేదా తేనె కలుపుకోవచ్చు.
జామ ఆకులలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. ఇవి పొట్ట ఆరోగ్యానికి మేలు చేస్తాయి, జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి మరియు మలబద్దకం నుండి ఉపశమనం కలిగిస్తాయి. డయాబెటిస్ ఉన్నవారు లేదా రక్తంలో చక్కెర స్థాయిలతో ఇబ్బంది పడే వారు జామ ఆకుల టీని తీసుకుంటే, రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు స్థిరంగా ఉంటాయి.
జామ ఆకుల టీలో విటమిన్-సి మరియు యాంటీ ఆక్సిడెంట్లు సమృద్దిగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి మరియు సీజనల్ ఇన్ఫెక్షన్లను ఎదుర్కోవడానికి సహాయపడతాయి. నిమ్మకాయ రసం కలిపితే మరింత ప్రయోజనకరం. జామ ఆకులలో యాంటీ క్యాన్సర్ గుణాలు కూడా ఉన్నాయి, అవి క్యాన్సర్ కు కారణమయ్యే ఫ్రీ రాడికల్స్ ను నివారించడంలో సహాయపడతాయి.