ఇజ్రాయెల్‌పై దాడులు: విద్యార్థులను కాపాడిన ఉపాధ్యాయుల సమయస్ఫూర్తి!
పశ్చిమ ఆసియాలో ఇజ్రాయెల్ మరియు హెజ్బొల్లా మధ్య జరుగుతున్న యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇటీవల టెల్ అవీవ్‌పై క్షిపణుల దాడి చేసిన హెజ్బొల్లా, మరోసారి డ్రోన్ దాడిని చేపట్టింది. ఈ ఘటనలో టీచర్ల సమయస్ఫూర్తి కారణంగా విద్యార్థులు ప్రాణాలతో బయటపడ్డారు.
ఇజ్రాయెల్‌లోని నెషార్లోని ఒక కిండర్‌గార్టెన్ స్కూల్ సమీపంలో హెజ్బొల్లా డ్రోన్ పడిపోయింది. ఆ ప్రాంతంలో సైరన్లు మోగకపోవడంతో ఉపాధ్యాయులు అప్రమత్తం కాలేదు. అప్పుడే పొరుగు పట్టణంలో సైరన్లు వినిపించడంతో వారు అప్రమత్తమై వెంటనే చిన్నారులను బాంబు షెల్టర్‌లోకి తరలించారు. డ్రోన్ దాడికి ముందు చిన్నారులను రక్షించడంలో ఉపాధ్యాయులు చూపించిన సమయస్ఫూర్తి ప్రశంసనీయం.
“నిజంగా అద్భుతం జరిగింది. పాఠశాలలో సైరన్లు మోగలేదు. కానీ పొరుగు పట్టణం నుంచి సైరన్లు వినిపించాయి. మేమంతా అప్రమత్తమై వెంటనే చిన్నారులను రక్షించాము. స్వల్ప వ్యవధిలోనే భారీ శబ్ధం వినిపించింది. అదృష్టవశాత్తూ మేమంతా ప్రాణాలతో బయటపడ్డాము” అని ఉపాధ్యాయురాలు సారా యసూర్ చెప్పారు.
పాఠశాల వెలుపల ఉన్న చెట్టుపై డ్రోన్ కూలిపోయింది. ఈ దాడి కారణంగా పాఠశాలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని సంబంధిత అధికారులు తెలిపారు.