హిమాచల్ కాంగ్రెస్ లో పెను మార్పులు: కొత్త పీసీసీ నిర్మాణానికి రంగం సిద్ధం

హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రెస్ పార్టీలో పెను మార్పులు చోటుచేసుకున్నాయి. హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (HPCC) పీసీసీ, జిల్లా అధ్యక్షులు మరియు బ్లాక్ కాంగ్రెస్ కమిటీలను రద్దు చేయాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే తెలిపారు.

ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వచ్చింది. ఇందుకు సంబంధించి కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ మార్పుల తరువాత హిమాచల్‌లో కొత్త పీసీసీ నిర్మాణం జరగనుంది.

హిమాచల్ మంత్రి అనిరుధ్ సింగ్ ఈ మార్పులను సాధారణ చర్యగా పేర్కొన్నారు. “త్వరలోనే కొత్త పీసీసీ చీఫ్‌ని నియమిస్తామని” ఆయన తెలిపారు. పీసీసీ, డీసీసీ, బ్లాక్ యూనిట్ల పదవీకాలం ముగిసినందున వాటిని రద్దు చేయాలనేది హిమాచల్ కాంగ్రెస్ కార్యకర్తలు చాలా కాలంగా చేస్తున్న డిమాండ్ అని ఆయన వివరించారు.

కాంగ్రెస్ హిమాచల్ ప్రదేశ్ విభాగానికి అధ్యక్షురాలు ప్రతిభా సింగ్ ఇటీవల పార్టీ హైకమాండ్‌కు లేఖ రాశారు. ప్రస్తుత కార్యవర్గాన్ని రద్దు చేసి, కొత్త కార్యవర్గాన్ని ఏర్పాటు చేయడానికి అనుమతించాలని ఆమె కోరారు. ఈ మార్పుల ద్వారా కొత్త కమిటీలలో క్రియాశీల సభ్యులకు ప్రాధాన్యత లభిస్తుందని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు.

2019లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్ తన రాష్ట్ర విభాగాన్ని రద్దు చేసింది. అయితే, ఆ సంవత్సరం ప్రారంభంలో నియమించబడిన ప్రెసిడెంట్ కులదీప్ సింగ్ రాథోడ్‌ను పదవిలో కొనసాగించింది. ప్రతిభా సింగ్ 2022లో కాంగ్రెస్ హిమాచల్ ప్రదేశ్ విభాగానికి అధిపతిగా నియమితులయ్యారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి పదవికి పోటీ పడేవారిలో మొదటి వరసలో నిలిచారు. కానీ ఆ పదవి సుఖ్వీందర్ సింగ్‌కి దక్కింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *