హిమాచల్ ప్రదేశ్‌లో సమోసా వివాదం
హిమాచల్ ప్రదేశ్‌లో ఇప్పుడు సమోసాలు రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖుపై విమర్శలకు ఇవి కారణమయ్యాయి. ఆక్టోబర్ 21న జరిగిన ఘటన దీనికి మూలం. సీఐడీ కార్యాలయానికి వెళ్లిన సీఎం, అక్కడ జరిగిన కార్యక్రమం కోసం ఒక ప్రముఖ హోటల్ నుంచి సమోసాలు తెప్పించారని, కానీ అవి సెక్యూరిటీ స్టాఫ్ చేతుల్లోకి చేరాయని వార్తలు వచ్చాయి. సీఎం కోసం తెచ్చిన సమోసాలు ఎలా మాయమయ్యాయో తెలుసుకోవడానికి సీఐడీ విచారణకు ఆదేశించారని మీడియా కథనాలు వెల్లడించాయి.
ఈ విషయంపై ప్రతిపక్ష భాజపా మండిపడింది. “సీఎం తినాల్సిన సమోసాలు ఎవరు తీసుకెళ్లారు..? సీఐడీ తేల్చనుంది..?” అని భాజపా నేత అమిత్ మాలవీయ ఎక్స్‌లో వ్యాఖ్యానించారు. ఈ వివాదం రాజకీయంగా హీటెక్కుతుండటంతో సుఖ్విందర్ సింగ్ సుఖు స్పందించాల్సి వచ్చింది. “అలాంటిది ఏమీ లేదు. సీఐడీ విచారణ జరుపుతున్న అంశం వేరు. మీరు మాత్రం సమోసా ప్రచారం నడుపుతున్నారు” అని సీఎం ఆగ్రహం వ్యక్తంచేశారు.
సీఐడీ కూడా స్పందించింది. “ఇదంతా సీఐడీ అంతర్గత వ్యవహారం. దీనిని రాజకీయం చేయొద్దు. ముఖ్యమంత్రి సమోసాలు తినరు. మేం ఎవరికీ నోటీసులు ఇవ్వలేదు. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలని ఆదేశించాం. ఈ విషయంతో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ సమాచారం ఎలా లీక్ అయిందో తెలుసుకుంటాం” అని సీఐడీ డీజీ సంజీవ్ రంజన్ మీడియాతో అన్నారు.