ఆలయ ప్రదక్షిణలో విషాదం!
కార్తీక మాసం ఉదయం, ఆంజనేయ స్వామి దర్శనానికి వెళ్లిన ఓ యువకుడికి తీవ్ర విషాదం ఎదురైంది. హైదరాబాద్ లోని కేపీహెచ్ బీ లోని ఆలయంలో ప్రదక్షిణలు చేస్తున్న సమయంలో అకస్మాత్తుగా కుప్పకూలి, ప్రాణాలు కోల్పోయాడు.
విష్ణువర్ధన్ అనే యువకుడు, గుడిలో స్వామి వారికి ప్రదక్షిణలు చేస్తుండగా అలసటగా అనిపించింది. నీరు తాగి తిరిగి ప్రదక్షిణలు చేస్తుండగానే ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. భక్తులు, అర్చకులు వెంటనే విష్ణుని లేపడానికి ప్రయత్నించారు, కానీ అతనిలో ఎలాంటి చలనం కనిపించలేదు. చివరకు 108 సహాయంతో ఆసుపత్రికి తరలించారు. వైద్యులు విష్ణుని పరిశీలించి మృతి చెందినట్లు నిర్ధారించారు.
స్థానిక సమాచారం ఆధారంగా ఆసుపత్రికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. ఆలయంలోని సీసీ ఫుటేజ్ లో ఈ విషాద సంఘటన రికార్డు అయ్యింది. విష్ణు మృతదేహాన్ని పోస్టుమార్టం తర్వాత కుటుంబ సభ్యులకు అప్పగించారు.
విష్ణు మృతితో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎదిగిన కొడుకు కుటుంబానికి అండగా ఉంటాడని ఆశపడ్డ తల్లిదండ్రులు, అతని విగత జీవిగా చూసి కన్నీరు మున్నీరుగా విలపించారు. యువకుడి మృతికి కారణం హార్ట్ స్ట్రోక్ అని తెలుస్తోంది.