ఓయోలో దారుణం!
హైదరాబాద్‌లోని ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువకుడు ప్రేమించిన అమ్మాయి ముందు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. బోరబండ ప్రాంతానికి చెందిన కె. ఓంకార్ అనే యువకుడు ఓ బ్యాంకులో ప్రైవేటు ఉద్యోగి. అదే బ్యాంకులో పనిచేసే తోటి ఉద్యోగితో గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నాడు. ఆదివారం (నవంబర్ 10)న ఇద్దరూ కలిసి రామంతాపూర్‌లోని ఒక ఓయో హోటల్ గదికి వెళ్లారు.
గదిలో ఏం జరిగిందో తెలియదు కానీ, ఓంకార్ ప్రియురాలి ముందు ఆమె చున్నీతోనే ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. అతని ప్రయత్నాన్ని చూసి ఆమె గట్టిగా కేకలు వేయడంతో హోటల్ సిబ్బంది గదికి వచ్చి అతన్ని కిందకు దించి వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఓంకార్ పరిస్థితి నిలకడగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు.
పోలీసులు హోటల్‌కు చేరుకొని ఓంకార్ ప్రియురాలి నుంచి వివరాలు తీసుకున్నారు. ప్రియురాలితో గొడవ పడి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. ఆరోగ్యం కుదిటపడిన తర్వాత అతడి నుంచి వివరాలు సేకరిస్తామని పోలీసులు తెలిపారు. ప్రజలు ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసుల్ని కోరుతున్నారు.