హైదరాబాద్ రోడ్ల అభివృద్ధిపై మంత్రి కోమటిరెడ్డి హామీలు

హైదరాబాద్ వాసులకు మంచి వార్త చెప్పారు మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి. ఎన్నో ఏళ్లుగా నిర్మాణ దశలోనే ఉన్న ఉప్పల్-నారపల్లి ఫ్లైఓవర్‌ను త్వరగా పూర్తి చేయడమే కాకుండా.. ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకువస్తామని హామీ ఇచ్చారు. వచ్చే రెండు నెలల్లో హైదరాబాద్ రోడ్లన్నీ మెరుగుపరచబోతున్నట్టు తెలిపారు.

“నారపల్లి ఫ్లైఓవర్ పూర్తి కావడానికి ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. ఇక ఆ ఎదురుచూపులకు ఫ్లైఓవర్ నిర్మాణ పనులను 18 నెలల్లో పూర్తి చేయబోతున్నాం!” అని మంత్రి గారు హామీ ఇచ్చారు.

గత ప్రభుత్వం రోడ్ల మరమ్మత్తులను పట్టించుకోలేదని మంత్రి ఆరోపిస్తూ, “రాష్ట్రంలోని రోడ్ల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 10 నెలల నుంచి రోడ్ల మరమ్మతులకు పూనుకున్నారని వెల్లడించారు. రోడ్ల మరమ్మతులకు ‘పార్ట్స్ హోల్ ఫిల్లింగ్’, ‘జెట్ స్పాచ్ మిషన్’ లాంటి కొత్త టెక్నాలజీలను ఉపయోగిస్తున్నట్టు చెప్పారు. 2015 నుంచి జీహెచ్ఎంసీలో ఈ టెక్నాలజీని ఉపయోగిస్తున్నప్పటికీ, రోడ్ల మరమ్మతులకు ఇప్పుడే ఉపయోగిస్తున్నారని వివరించారు.

“పంచాయతీ రాజ్, ఆర్ అండ్ బీ శాఖ ఆధ్వర్యంలో వచ్చే రెండేళ్లలో రోడ్లు లేని చోట్ల రోడ్లు వేయబోతున్నాం. వచ్చే రెండు నెలల్లో రోడ్ల మరమ్మతులను పూర్తి చేయాలని అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చాను!” అని మంత్రి స్పష్టం చేశారు.

2021 లో రంగారెడ్డి జిల్లాలో జాతీయ రహదారి మంజూరు అయితే, ఇప్పటివరకు పనులు ప్రారంభం కాలేదని మంత్రి చెప్పారు. “ఎన్జీటీ నుంచి క్లియరెన్స్ వచ్చింది. వచ్చే నెల చివరలో హైదరాబాద్-విజయవాడ ఆరు లైన్ల రోడ్ ప్రాజెక్టుకు టెండర్లు పిలువబోతున్నాం,” అని వెల్లడించారు.

“గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ఉప్పల్-నారపల్లి ఫ్లైఓవర్ ఏడేళ్లయినా పూర్తి కాలేదు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే పనులు మొదలుపెట్టేందుకు లక్ష్యం నిర్దేశించామని, 18 నెలల్లో ఫ్లైఓవర్‌ను పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌కు ఆదేశాలిచ్చామని మంత్రి చెప్పారు. గత బీఆర్ఎస్ సర్కార్ 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి కనీసం 7 కిలోమీటర్ల ఫ్లైఓవర్‌ను కూడా పూర్తి చేయలేకపోయింది!” అని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.

“మాజీ మంత్రి కేటీఆర్ ఎప్పుడూ ఎన్‎హెచ్ఏఐ అధికారులు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దగ్గరకు వెళ్లి రోడ్లు మంజూరు చేయమని అడగలేదు. ప్రధానిని మోడీ బోడీ అంటూ విమర్శించడానికే సరిపోయాడు!” అని మంత్రి విమర్శలు గుప్పించారు.

“రాష్ట్రంలో 12 వేల కిలోమీటర్ల మేర డబుల్ రోడ్లు వేయబోతున్నాం!” అని మంత్రి ప్రకటించారు.

వికారాబాద్ కలెక్టర్‌పై జరిగిన దాడి గురించి స్పందిస్తూ, “కలెక్టర్ మీద దాడి చాలా బాధాకరమైన విషయం. అధికారుల మీద దాడి సరికాదు. ప్రజాభిప్రాయ సేకరణలో తమ అభిప్రాయాలు చెప్పాలి. కానీ ఇలా దాడి చేయడం ఏంటని” అని మంత్రి ప్రశ్నించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *