హైదరాబాద్ జంట జలాశయాల రక్షణ బాధ్యత హైడ్రాకు

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాలు, నాలాల పరిరక్షణ బాధ్యతను నిర్వహిస్తున్న ‘హైడ్రా’ ఇప్పుడు మరిన్ని కీలక బాధ్యతలను చేపట్టింది. నగరంలోని చెరువుల ఎఫ్‌టీఎలు, బఫర్‌జోన్లు ఆక్రమించిన అక్రమ నిర్మాణాలను ధ్వంసం చేసి, ఆక్రమణదారులకు నోటీసులు జారీ చేయడం, నగరంలోని ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టడం, ఫుట్‌పాత్‌ల ఆక్రమణల కూల్చివేత వంటి అనేక బాధ్యతలను హైడ్రా నిర్వహిస్తుండగా, ఇప్పుడు మరో కీలక బాధ్యత దక్కడంతో హైడ్రా పరిధి విస్తరించింది.

హైదరాబాద్ నగరానికి తాగునీటిని సరఫరా చేసే జంట జలాశయాలైన ఉస్మాన్ సాగర్ మరియు హిమాయత్ సాగర్ల పరిరక్షణ బాధ్యతను కూడా హైడ్రాకు అప్పగించారు. ఇకపై హైదరాబాద్ వాటర్ బోర్డు నీటి సరఫరాకు మాత్రమే పరిమితం అవుతుంది. హైదరాబాద్ మెట్రో వాటర్ బోర్డు (HMWS) ఏర్పాటు తర్వాత ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలను బోర్డు పరిధిలోకి తీసుకువచ్చినా, జలాశయాల క్యాచ్మెంట్ ఏరియాలు, FTL, బఫర్ జోన్లలో ఆక్రమణల గురించి వాటర్ బోర్డు అధికారులు పెద్దగా పట్టించుకోలేదు. దీని ఫలితంగా జలాశయాల పరిధిలో పెద్ద ఎత్తున కబ్జాలు జరిగాయి.

ఉస్మాన్ సాగర్కు 46 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉండగా.. నీటి నిల్వ సామర్థ్యం 3.9 టీఎంసీలు. జలాశయం పరిధిలో మొత్తం 84 గ్రామాలు ఉన్నాయి. ఉస్మాన్సాగర్ సమీపంలోనే గచ్చిబౌలి, కొండాపూర్, నానక్రామ్గూడ, మాదాపూర్ ప్రాంతాలు ఐటీహబ్గా డెవలప్ అయ్యాయి. హిమాయత్ సాగర్ 35 చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉండగా.. నీటి నిల్వ సామర్థ్యం 2.9 టీఎంసీలు. శంషాబాద్, మొయినాబాద్, సుల్తాన్పల్లి, నర్కుడా, నాగిరెడ్డిగూడ, అజీజ్నగర్, కొత్వాల్గూడ, కవ్వగూడ తదితర ప్రాంతాలు ఈ జలాశయం పరిధిలోకి వస్తాయి. ఈ ప్రాంతాల్లో వర్షాలు కురిస్తే ఆ వర్షపు నీరు నేరుగా హిమాయత్సాగర్, ఉస్మాన్సాగర్లకు చేరుకుంటాయి.

ఈ రెండు జలాశయాల పరీవాహక ప్రాంతాలను పరిరక్షించేందుకు 1995లో అప్పటి ప్రభుత్వం ప్రత్యేకంగా జీవో 111 తీసుకువచ్చింది. ఈ జీవో ప్రకారం జలాశయాలకు 10 కిలోమీటర్ల పరిధిలో ఎలాంటి భారీ నిర్మాణాలు, భారీ పరిశ్రమలు చేపట్టకూడదు. అయినా వాటర్ బోర్డు నిర్లక్ష్యం కారణంగా భారీగా అక్రమ నిర్మాణాలు వెలిశాయి. బోర్డుకు ప్రత్యేకంగా విజిలెన్స్ సెల్ ఆక్రమణలను అడ్డుకోలేకపోయింది. దీంతో వారసత్వ కట్టడాలుగా ఈ రెండు జంట జలాశయాల పరిరక్షణ బాధ్యతలను సర్కార్ హైడ్రాకు అప్పగించింది.

ఈ రెండు జలాశయాలకు సమీపంలో భారీగా నిర్మించిన ఫాంహౌస్లు, ఇతర చోట్ల నుంచి వచ్చి కలుస్తున్న మురుగును అడ్డుకోవటం, నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చివేసే బాధ్యతను హైడ్రాకు అప్పగించారు. ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల జంట జలాశయాల పరిరక్షణకు తోడ్పడడమే కాకుండా, నగరానికి స్వచ్ఛమైన తాగునీటిని అందించడానికి కూడా దోహదపడుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *