కడప కార్పొరేషన్‌లో రాజకీయ ఉగ్రరూపం: మాధవీ రెడ్డి నిరసన
కడప మున్సిపల్ కార్పొరేషన్ సమావేశం.. అధికారం మరియు అహంకారం యొక్క నిజ రూపాన్ని ప్రదర్శించింది! ఎమ్మెల్యే మాధవీ రెడ్డి నిరసన మధ్య సమావేశం ఆరంభం కాకముందే ఆగిపోయింది. ఎక్స్ అఫిషియో సభ్యురాలిగా ఆమెకు తగిన గౌరవం లేకుండా, కార్పొరేటర్లతో సమానంగా సీటు కేటాయించడంతో, ఆమె మేయర్ వేదిక పక్కనే నిలబడి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. మైక్ తీసుకొని మాట్లాడే అవకాశం కోరారు.
సమావేశం ప్రారంభానికి ముందే ఎమ్మెల్యే మాధవీ రెడ్డి వైసీపీ మేయర్ సురేష్ బాబుపై అవినీతి ఆరోపణలు గుప్పించారు. “విచారణకు సిద్ధమేనా?” అని సవాల్ విసిరారు. దీంతో సమావేశం గంటకు పైగా గందరగోళంలో మునిగిపోయింది. మాధవీ రెడ్డి మాట్లాడకుండా నిరోధించడానికి కౌన్సిల్ సభ్యులు గొడవకు దిగారు. కొందరు కార్పొరేటర్లు సమావేశాన్ని బహిష్కరించి వెళ్ళిపోయారు. చివరకు, మేయర్ సురేష్ బాబు అసహనానికి గురై సమావేశం నుంచి బయటకు వెళ్ళిపోయారు.
“కార్పొరేషన్ నిధులను మేయర్ సొంతానికి వాడుకుంటున్నారు” అని మాధవీ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. మేయర్ మరియు కార్పొరేటర్లు సమావేశాన్ని బహిష్కరించారు.
“ఒక మహిళగా నా పట్ల ఎందుకు ఈ చులకన భావన? నాకు పెద్ద కుర్చీ వేశారు.. ప్రజల కోసం నేను పోరాడుతాను.. అహంకారం, అధికారం ఎలా ప్రదర్శిస్తాయో ఈ సమావేశమే నిదర్శనం” అని మాధవీ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
“మేయర్ సొంత కారు వాడుకుంటూ కార్పొరేషన్ నిధులను దుర్వినియోగం చేస్తున్నాడు.. మహిళను అవమానించిన వారు చరిత్రలో బాగుపడిన దాఖలాలు లేవు.. సంప్రదాయాలకు విరుద్ధంగా మహిళలను అవమానించారు.. చిన్నచౌక్ ప్రాంతానికి మేయర్ ఏం చేశారు? కుర్చీ లాగేస్తే ఇంట్లో కెళ్ళి ఏడుస్తూ కూర్చుంటాం అనుకున్నారేమో.. ప్రజా సమస్యల గురించి పట్టించుకోకుండా కుర్చీలాట ఆడుతున్నారు.. తెలుగుదేశం మహిళ ఎమ్మెల్యేలను గౌరవించకుండా ఇలా అవమానించడం సాంప్రదాయమా? ఈ పెద్ద మనిషి చేసిన అవినీతి అక్రమాలు బయటపడతాయని ఇలాంటి దుశ్చర్యకు పాల్పడ్డారు” అని ఆమె మేయర్‌పై విరుచుకుపడ్డారు.