కాళేశ్వరం, కార్ల రేస్ కేసులపై పొంగులేటి ఆరోపణలు
ఖమ్మంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కేసీఆర్, కేటీఆర్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. గత ప్రభుత్వం చేసిన అప్పులు, మిత్తిలు కట్టడం ఇబ్బందిగా ఉందని ఆయన అన్నారు. “రాజకీయ ప్రత్యర్థులను భయపెట్టడానికి వ్యాఖ్యలు చేయడం, తమ తప్పులను దాచడానికి అబద్ధాలు చెప్పడం కేసీఆర్, కేటీఆర్ ప్రత్యేకత” అని పొంగులేటి విమర్శించారు.
“కాళేశ్వరం ప్రాజెక్టు ఎవరి కోసం కట్టారు?” అని ఆయన ప్రశ్నించారు. “ఎనిమిదో వింత కాళేశ్వరం కూలిపోవడానికి కేసీఆర్ ప్రభుత్వమే బాధ్యత వహించాలి” అని ఆయన ఆరోపించారు. కేటీఆర్ తనను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ, “కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రితో మీకు పని ఏమిటి?” అని ప్రశ్నించారు.
కార్ల రేస్ కేసులో అవకతవకలు జరిగాయని గుర్తించి ఏసీబీ విచారణ జరుపుతోందని, 13 రోజుల క్రితం కేటీఆర్‌ను విచారించేందుకు గవర్నర్‌కి ఏసీబీ విజ్ఞప్తి చేసిందని పొంగులేటి తెలిపారు. “కేసులు విత్‌డ్రా చేయించుకునేందుకు కేటీఆర్ ఢిల్లీ వెళ్లి బీజేపీ నేతలను కలిశారని మా వద్ద ఆధారాలు ఉన్నాయి” అని ఆయన ఆరోపించారు.
కార్ల రేస్ కేసును కవిత కేసుతో పోలుస్తూ, “ఢిల్లీ వెళ్లి తమ తప్పులను దాచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు” అని మంత్రి విమర్శించారు. “విదేశాలకు పంపిన రూ. 55 కోట్లు చట్టపరంగా ఎలా పంపారు?” అని ఆయన ప్రశ్నించారు. “కేబినెట్ అప్రూవల్ లేకుండా డబ్బులు పంపడం ఎలా సాధ్యం?” అని ఆయన ప్రశ్నించారు.
“ఫోన్ ట్యాపింగ్ చిన్న విషయం కాదు. ఖమ్మం జిల్లాలో నా ఫోన్ కూడా ట్యాపింగ్ చేశారు” అని ఆయన ఆరోపించారు. “ఇంకా అనేక కేసులు వస్తాయి. అన్ని కేసులు బయటకి వస్తే మీరు అంతరిక్షంలో దాక్కుంటారేమో అన్న అనుమానాలు వస్తున్నాయి” అని ఆయన విమర్శించారు.