కేసీఆర్ పాలనలో అవినీతిని బహిర్గతం చేయడానికి మహాపాదయాత్ర: సత్యనారాయణ
తెలంగాణ రక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు నరాల సత్యనారాయణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ పాలనలో మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణ లోటు బడ్జెట్‌గా మారిందని, పదేళ్ల పాలనలో అనేక అక్రమాలు జరిగాయని ఆరోపించారు. మంగళవారం హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్, విద్యుత్ ఒప్పందం, భూబదలాయింపులో వేల కోట్ల అవినీతి జరిగిందని సత్యనారాయణ ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ కేసు, కవిత మద్యం స్కామ్, దళిత బంధులో కూడా అక్రమాలు జరిగాయని విమర్శించారు. కేసీఆర్ అవినీతి, అక్రమాలను ప్రజలకు తెలియజేయడానికి డిసెంబర్ 6న భద్రాచలం నుంచి మహాపాదయాత్ర ప్రారంభమవుతుందని తెలిపారు. ఈ పాదయాత్ర చిలుకూరు బాలాజీ టెంపుల్ వద్ద ముగుస్తుందని, 33 జిల్లాల గుండా కొనసాగుతుందని వివరించారు. కార్యక్రమంలో నాయకులు మంజూష, సురేఖ, లక్ష్మి, కె. శారద, రేఖ, లావణ్య, శ్రీలత తదితరులు పాల్గొన్నారు.