కింగ్ కోహ్లీ ర్యాంకింగ్స్‌లో కుప్పకూలిపోయాడు!

న్యూజిలాండ్ సిరీస్‌లో టీమిండియా ఓటమి, బ్యాటింగ్ వైఫల్యం.. ఈ రెండూ విరాట్ కోహ్లీని నిరాశా సముద్రంలో ముంచెత్తాయి. అన్నివైపుల నుండి వచ్చే విమర్శలకు, ఈ పరిస్థితి నుండి త్వరగా బయటపడాలనే కోరికకు మధ్య కోహ్లీ కొట్టుమిట్టాడుతున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో తన బ్యాట్‌తో విమర్శకులకు సమాధానం ఇవ్వాలని తీవ్రంగా కోరుకుంటున్నాడు. అయితే, ఈ సమయంలో కోహ్లీకి మరో షాకింగ్ న్యూస్ వచ్చింది.

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ తాజాగా ప్రకటించిన మెన్స్ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో కోహ్లీ 22వ స్థానానికి పడిపోయాడు. అన్ని ఫార్మాట్లలోనూ అద్భుతమైన ఆటతీరుతో ‘మోడర్న్ మాస్టర్’గా పేరు తెచ్చుకున్న కింగ్.. ర్యాంకింగ్స్‌లో ఇంతలా దిగజారడం చర్చనీయాంశంగా మారింది. 2014 ఆగస్టులో 24వ స్థానంలో ఉన్న కోహ్లీ.. గత పదేళ్లుగా టెస్టు క్రికెట్‌లో తన హవా నడిపించాడు. ర్యాంకింగ్స్‌లో టాప్-3 నుండి టాప్-10 లో నిలబడి తన స్టార్‌డమ్‌ను కొనసాగించాడు. అలాంటి వ్యక్తి టాప్-20 కంటే కిందకు దిగజారడం హాట్ టాపిక్‌గా మారింది.

న్యూజిలాండ్ సిరీస్‌లో వైఫల్యంతో పాటు, అంతకు ముందు జరిగిన బంగ్లాదేశ్ సిరీస్‌లో కూడా కోహ్లీ అంతగా రాణించలేకపోయాడు. టెస్టులు తక్కువగా ఆడటం, ఆడిన వాటిల్లో ఫెయిల్ అవడంతో పదేళ్ల కాలంలో తొలిసారి ఇరవై కంటే తక్కువ ర్యాంకుకు కోహ్లీ దిగజారాడు. ఇది అభిమానులకు మింగుడుపడని విషయం. ఎన్నో రికార్డులను తన పేరిట రాసుకున్న రారాజు.. ర్యాంకులను ఏలిన విరాట్ ఇలా కిందకు రావడం ఘోర అవమానమని సోషల్ మీడియాలో నెటిజన్స్ అంటున్నారు. కెప్టెన్ రోహిత్ శర్మ (26వ ర్యాంకు) కూడా ర్యాంకింగ్స్‌లో దిగజారడం దారుణమని కామెంట్స్ చేస్తున్నారు.

టెస్ట్ ర్యాంకింగ్స్‌లో భారత్ నుండి జూనియర్లు యశస్వి జైస్వాల్ (4వ ర్యాంకు), రిషబ్ పంత్ (6వ ర్యాంకు) టాప్-10 లో నిలిచి పరువు కాపాడారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *