చంద్రబాబు నాయుడు సోదరుడు మృతి, విషాదంలో కుటుంబం!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సోదరుడు, నారా రామ్మూర్తి నాయుడు గారు కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా శనివారం మధ్యాహ్నం గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఈ విషాద వార్త తెలియగానే, చంద్రబాబు తన ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకుని హైదరాబాద్కు తిరుగు ప్రయాణం అయ్యారు. మంత్రి నారా లోకేష్ అమరావతి నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకున్నారు. నారా, నందమూరి కుటుంబ సభ్యులంతా ఆసుపత్రికి చేరుకొని శోక సంద్రంలో మునిగిపోయారు. రామ్మూర్తి నాయుడి అంత్యక్రియలు ఆదివారం ఆయన స్వగ్రామం నారావారిపల్లెలో జరుగనున్నట్లు కుటుంబసభ్యులు ప్రకటించారు. సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన మృతికి సంతాపం తెలియజేస్తున్నారు.
1994 నుంచి 1999 వరకు, రామ్మూర్తి నాయుడు తెలుగుదేశం పార్టీ తరఫున చంద్రగిరి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా సేవలందించారు. ఇటీవలే ఆయన కుమారుడు నారా రోహిత్, ‘ప్రతినిధి 2’ చిత్ర నటి సిరిలెల్లాతో నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. వారి వివాహం త్వరలో జరగాల్సి ఉండగా, ఈ విషాదం ఆ కుటుంబాన్ని కుదిపేసింది.