నోటి ఆరోగ్యానికి ఇంటి చిట్కా: అలోవెరా టూత్ పేస్ట్
నోటి ఆరోగ్య విషయంలో దంతాలు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. తెల్లని దంతాలు, మంచి పల్ల వరుస ఉంటే మనం ఆత్మవిశ్వాసంగా మాట్లాడగలం, హాయిగా నవ్వగలం. కానీ దంతాల మీద గార, పాచి, దంతాలు రంగు మారడం వంటి సమస్యలుంటే మాత్రం చాలా ఇబ్బంది. ముఖ్యంగా బయటకు వెళ్లాలనుకున్నా, నలుగురిలో మాట్లాడాలనుకున్నా సంకోచించాల్సి వస్తుంది. ఈ సమస్యలకు పరిష్కారం కోసం మార్కెట్లో దొరికే టూత్ పేస్ట్ లు మార్చి మార్చి వాడుతున్నాము. కానీ, ఇంట్లోనే తయారు చేసుకునే ఈ టూత్ పేస్ట్ వాడితే దంతాల సమస్యలన్నీ మాయమవుతాయి.
కావలసిన పదార్థాలు:
* అలోవెరా జెల్: రెండు స్పూన్లు
* బేకింగ్ సోడా: రెండు స్పూన్లు
* కొబ్బరి నూనె: ఒక స్పూన్
* పుదీనా ఆకులు: కొన్ని
తయారు విధానం:
పుదీనా తప్ప, మిగతా పదార్థాలను ఒక గిన్నెలో వేసి బాగా మిక్స్ చేయాలి. అన్నీ బాగా కలిసిన తర్వాత పుదీనా ఆకుల సారాన్ని వేయాలి. లేదంటే పిప్పరమెంట్ ఎసెన్షియల్ ఆయిల్ కూడా వేయవచ్చు. ఇప్పుడు టూత్ పేస్ట్ రెడీ!
తయారు చేసుకున్న టూత్ పేస్ట్ ను ఒక గాజు కంటైనర్ లో భద్రపరుచుకోవాలి. పాడు కాకుండా ఉండటానికి దీన్ని ఫ్రిడ్జ్ లో నిల్వ చేయవచ్చు.
అలోవెరా దంతాలకు ఎలా ఉపయోగపడుతుంది?
అలోవెరాను చర్మ సంరక్షణ, కేశ సంరక్షణలో మాత్రమే కాకుండా దంత సంరక్షణలో కూడా వినియోగిస్తారు. అలోవెరాలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. అలోవెరాను టూత్ పేస్ట్ తయారీలో ఉపయోగించడం వల్ల దంతాలు సురక్షితంగా ఉంటాయి.