పటాన్ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కి బలైన విద్యార్థి

గుజరాత్‌లోని పటాన్‌లోని ధర్‌పూర్ మెడికల్ కాలేజీలో జరిగిన విషాద ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. సీనియర్ విద్యార్థుల దారుణమైన ర్యాగింగ్‌కు గురైన మొదటి సంవత్సరం విద్యార్థి అనిల్ మెథానియా మృతిచెందాడు. ఈ దారుణ ఘటన తర్వాత, కళాశాల యాజమాన్యం 15 మంది సీనియర్లను అకడమిక్‌, హాస్టల్‌ కార్యక్రమాల నుంచి తక్షణమే తొలగించింది. కళాశాల అదనపు డీన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, ర్యాగింగ్‌కు పాల్పడిన వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

నవంబర్ 1న అనిల్ మరణించాడని, తరువాతే కాలేజీ డీన్ హార్దిక్ షా ర్యాగింగ్ నిరోధక కమిటీని ఏర్పాటు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడం ఆందోళన కలిగిస్తోంది.

పోలీసుల విచారణ ప్రకారం, సీనియర్లు రాత్రి 8:30 గంటలకు జూనియర్లను పరిచయం కోసం పిలిచారు. అనిల్‌తో సహా కొంతమంది జూనియర్లు వెళ్లగా, సీనియర్లు వారిని ర్యాగింగ్‌ చేయడం ప్రారంభించారు. సినిమా పాటలు పాడమని, డ్యాన్స్ చేయమని బలవంతం చేశారు. అనిల్‌ను దుర్భాషలాడి, మూడు గంటల పాటు నిలబెట్టారు. అతని ఆరోగ్యం క్షీణించి, కింద పడిపోయాడు. ఆస్పత్రికి తరలించేలోపు అతను మృతి చెందాడు.

కళాశాల కమిటీ ఇతర సీనియర్లను విచారించి, ర్యాగింగ్ జరిగిన విషయాన్ని నిర్ధారించింది. దీంతో 15 మంది సీనియర్లను సస్పెండ్ చేసింది. పోలీసులు భారతీయ శిక్షా స్మృతిలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సీసీటీవీ ఫుటేజీ, ఇతర ఆధారాల ఆధారంగా నిందితులపై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *